MEA: తాలిబన్లతో మరిన్ని భేటీలపై సమాచారం లేదు: కేంద్రం

అఫ్గానిస్థాన్‌ భూభాగం భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద కుట్రలకు వేదిక కారాదనే విషయాన్ని ఇటీవల తాలిబన్లతో చర్చల్లో ప్రధానంగా లేవనెత్తినట్టు కేంద్రం తెలిపింది.......

Published : 02 Sep 2021 22:52 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ భూభాగం భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద కుట్రలకు వేదిక కారాదనే విషయాన్ని ఇటీవల తాలిబన్లతో చర్చల్లో ప్రధానంగా లేవనెత్తినట్టు కేంద్రం తెలిపింది. తాలిబన్లతో ఇటీవల తొలిసారి దోహా వేదికగా చర్చలు జరగ్గా.. తదుపరి చర్చలపై ఎలాంటి సమాచారం లేదని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి స్పష్టంచేశారు. అఫ్గాన్‌లో మిగిలిన భారతీయుల తరలింపుపై ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతం కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారని, ఎయిర్‌పోర్టు నుంచి సేవలు పునఃప్రారంభమయ్యాక తరలింపు ప్రారంభమవుతుందన్నారు.

అఫ్గాన్‌లో ఇంకా ఎంతమంది భారతీయులు ఉన్నారో కచ్చితంగా చెప్పడం కష్టమమని అరిందమ్‌ బాగ్చి అన్నారు. ఎవరైతే అక్కడి నుంచి తిరిగి వచ్చేయాలనుకున్నారో వారిలో అత్యధిక భాగం భారత్‌కు చేరుకున్నారని తెలిపారు. అఫ్గానిస్థాన్‌లో ఏ రకమైన ప్రభుత్వం ఏర్పడుతుందనే వివరాలేమీ తమ వద్ద లేవని తెలిపారు. ఖతార్‌లో భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌ ఇటీవల దోహాలో తాలిబన్‌ నేత షెర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల భద్రతతో పాటు వారిని త్వరగా స్వదేశానికి తీసుకొచ్చే అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు గతంలో కేంద్ర విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని