Earthquake: తుర్కియేలో భారతీయులు సేఫ్‌.. ఒకరు మిస్సింగ్‌

భూకంపం(Earthquake) ధాటికి అతలాకుతలమైన తుర్కియేలో భారతీయులు సురక్షితంగానే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బిజినెస్‌ పనిమీద వెళ్లిన ఓ వ్యక్తి జాడ మాత్రం తెలియడం లేదని తెలిపింది.

Updated : 08 Feb 2023 19:12 IST

దిల్లీ: తుర్కియే (Turkey) భూకంపంలో ఇప్పటివరకు 11 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించగా.. మరెంతో మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఒక వ్యక్తి జాడ మాత్రం తెలియడం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భూకంపం (Earthquake) సంభవించిన మారుమూల ప్రాంతాల్లో మరో 10 మంది చిక్కుకున్నారని.. అయినప్పటికీ వారంతా క్షేమంగానే ఉన్నారని తెలిపింది.

‘తుర్కియాలోని అదానాలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాల్లో 10 మంది చిక్కుకుపోయారు. అయితే వారందరూ సురక్షితంగా ఉన్నారు. బిజినెస్‌ పనిమీద తుర్కియేకు వెళ్లిన ఓ వ్యక్తి ఆచూకీ మాత్రం లభించడం లేదు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో ఆయన పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్నాం’ అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్‌ వర్మ పేర్కొన్నారు. తుర్కియేలో మొత్తంగా దాదాపు 3వేల మంది భారతీయులు ఉన్నట్టు చెప్పారు.

మరోవైపు, ఆపరేషన్‌ దోస్త్‌ పేరుతో తుర్కియేకు భారత్‌ మానవతా సహాయాన్ని అందిస్తున్నట్లు విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వెల్లడించారు. 100 ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, శిథిలాలను తొలగించే పరికరాలు, వాహనాలు, డాగ్‌ స్క్వాడ్‌లను పంపించినట్లు చెప్పారు. వీరితోపాటు 99 మంది వైద్య సిబ్బంది, ఎక్స్‌రే పరికరాలు, వెంటిలేటర్లు, ఆపరేషన్‌ థియేటర్లు, అంబులెన్సులు, జనరేటర్ల వంటివి ఇందులో ఉన్నాయని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు