Corona Virus: మూడో దశ చాలా డేంజర్‌!

కరోనా సెకండ్‌ వేవ్‌ చేసిన గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మూడో ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఈ మహమ్మారిని ......

Published : 09 Jul 2021 01:31 IST

జాగ్రత్తలు పాటిస్తే తప్పించుకోగలమన్న కశ్మీర్‌ వైద్య నిపుణుడు

శ్రీనగర్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ చేసిన గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మూడో ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో పాటించాల్సిన జాగ్రత్తల్లో ఉదాసీనంగా ఉంటే మాత్రం మూడో దశ చాలా ప్రమాదకరంగా ఉంటుందని జమ్మూకశ్మీర్‌కు చెందిన వైద్య నిపుణుడు డిపార్టుమెంట్‌ ఆఫ్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ హెడ్‌ డాక్టర్ మహమ్మద్‌ సలీం ఖాన్‌ హెచ్చరించారు. థర్డ్‌ వేవ్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు గతంలో ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన నిబంధనల్ని ప్రతిఒక్కరూ పాటించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా మూడో దశ చాలా ప్రమాదకరమైందని, ప్రాణాంతంగా మారి ఎంతో మందిని బలితీసుకొనే అవకాశం ఉందన్నారు. 

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో రోజువారీ పాజిటివ్‌ కేసులు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉంటోందని చెప్పారు. దీంతో జనం కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ఇది చాలా ప్రమాదకరమని, ఈ నిర్లక్ష్యం కరోనా మూడో దశ ముప్పుకు దారితీస్తుందని హెచ్చరించారు. కరోనా కేసులు, మరణాలు తగ్గడం సెకండ్‌ వేవ్‌పై పోరాటంలో గెలుపునకు నిదర్శనమన్న ఆయన.. కేసులు తగ్గుతున్నాయని జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మాత్రం తీవ్ర ముప్పు తప్పదన్నారు.

మాస్క్‌లు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా మార్కెట్లు, హెల్త్‌ రిసార్టులు, వివాహ వేడుకల్లో పాల్గొనడం అనాలోచితమన్నారు. మన కుటుంబాలు, సమాజ భద్రతను, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఏడాదిన్నరకు పైగా ఇళ్లకే పరిమితమైపోయిన జనం.. సాధారణ జీవనాన్ని ప్రారంభించేందుకు ఆతృతతో ఉండటం సహజమేనన్నారు. కానీ బయటకు వెళ్లేటప్పుడు కఠిన నిబంధనలు పాటించడం ద్వారానే మూడో ముప్పును నివారించగలమన్నారు. వైరస్‌ నివారణకు బలమైన అస్త్రమైన టీకాను ప్రతిఒక్కరూ వేయించుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని