Sumnima Udas: ఈమె పెళ్లి కోసమే నేపాల్‌కు రాహుల్‌.. ఇంతకీ ఎవరీ సుమ్నిమా ఉదాస్‌?

నేపాల్‌ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అక్కడ ఓ నైట్‌ క్లబ్‌కు వెళ్లినట్టు బయటకొచ్చిన దృశ్యాలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. ఈ అంశంపై భాజపా, కాంగ్రెస్‌ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. .....

Updated : 04 May 2022 06:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేపాల్‌ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అక్కడ ఓ నైట్‌ క్లబ్‌కు వెళ్లినట్టు బయటకొచ్చిన దృశ్యాలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. ఈ అంశంపై భాజపా, కాంగ్రెస్‌ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా చెప్పుకొనే నాయకుడు నైట్‌క్లబ్‌ల్లో తిరగడమేంటంటూ భాజపా విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా.. వ్యక్తిగత పర్యటనలపై విమర్శలేంటని కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇస్తోంది. మరోవైపు, తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా రాహుల్‌ గాంధీ ఐదు రోజుల పర్యటనకు సోమవారం కాఠ్‌మాండూ వెళ్లారు. తన నేపాలీ స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్‌ వివాహానికి రాహుల్‌ వెళ్లినట్టు అక్కడి మీడియా పేర్కొంది. భారత్‌కు చెందిన మరికొందరు వీఐపీలు కూడా హాజరవుతున్నట్టు తెలిపింది. అసలు ఎవరీ సుమ్నిమా ఉదాస్‌? ఆమె గురించి కొన్ని వివరాలు..

సుమ్నిమా ఉదాస్‌ ఓ పాత్రికేయురాలు. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ ఇంటర్నేషనల్‌కు దిల్లీ ప్రతినిధిగా ఆమె పనిచేశారు. దేశంలో కీలక రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర రంగాలపై అనేక ఆసక్తికర కథనాలు ఇచ్చారు. దేశంలో సంచలనం సృష్టించిన దిల్లీ గ్యాంగ్‌రేప్‌ కేసుతో పాటు మలేషియా విమానం కుప్పకూలడం, కామన్వెల్త్‌ అవినీతి కుంభకోణం తదితర అంశాలపైనా ప్రముఖంగా కథనాలను రాశారు. ఆమె లింక్డ్ ఇన్‌ ఖాతాలో తెలిపిన వివరాల ప్రకారం.. 2001 నుంచి 2017వరకు సీఎన్‌ఎన్‌లో పనిచేసిన సుమ్నిమా.. 2018 నుంచి లుంబినీ మ్యూజియం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, ఫౌండర్‌గా కొనసాగుతున్నారు. 

లింగ సంబంధిత సమస్యలపై రిపోర్టింగ్‌ చేసినందుకు గాను 2014 మార్చిలో జరిగిన మహిళా సాధికారత (WE) జర్నలిజం అవార్డ్స్‌లో భాగంగా సుమ్నిమాకు ‘జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. అలాగే, భారత్‌లోని గ్రామాల్లో బానిసత్వం గురించి రిపోర్టింగ్‌ చేసినందుకు 2012లో ప్రతిష్ఠాత్మక సినీ గోల్డెన్‌ ఈగల్‌ అవార్డు గెలుచుకున్న టీమ్‌లో ఉదాస్‌ కూడా ఒకరు. సుమ్నిమా ఉదాస్‌ తండ్రి భీమ్‌ ఉదాస్‌ దౌత్య అధికారిగా పనిచేశారు. మయన్మార్‌లో నేపాల్‌ రాయబారిగా సేవలందించారు. దీంతో ఆమె చిన్నప్పట్నుంచి దాదాపు 10 దేశాల్లో ఉన్నారు. వర్జినియాలోని వాషింగ్టన్‌ అండ్‌ లీ యూనివర్సిటీలో బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిజంలో బ్యాచిలర్‌ డిగ్రీ చేసిన ఉదాస్‌.. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. 

మంగళవారం సుమ్నిమా వివాహం జరగనుండటంతో రాహుల్ గాంధీ సోమవారం కాఠ్‌మాండూ వెళ్లారు. మే 5న హయత్‌ రీజెన్సీ హోటల్‌లో రిసెప్షన్‌ జరగనుంది. అయితే, తమ కుమార్తె పెళ్లికి రాహుల్‌ గాంధీని ఆహ్వానించినట్టు సుమ్నిమా తండ్రి భీమ్‌ ఉదాస్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని