
Mehbooba Mufti: ₹10 కోట్లు చెల్లించండి.. గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు ముఫ్తీ లీగల్ నోటీసు
శ్రీనగర్: రోష్ని పథకం విషయంలో తప్పుడు ఆరోపణలతో తన పరువుకు నష్టం వాటిల్లేలా చేశారని విమర్శిస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ శుక్రవారం మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు లీగల్ నోటీసులు పంపారు. 30 రోజుల్లోగా రూ.10 కోట్లు పరిహారంగా చెల్లించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. పరిహారం డబ్బును వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా, ప్రజా శ్రేయస్సుకు ఉపయోగిస్తారని ముఫ్తీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కశ్మీర్లో రోష్ని పథకం ఉన్నప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అక్రమంగా లబ్ధి పొందారని ఇటీవల సత్యపాల్ మాలిక్ ఆరోపించిన విషయం తెలిసిందే.
బుధవారం సైతం మెహబూబా.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా గవర్నర్ మాలిక్‌ను ట్విటర్ వేదికగా కోరారు. మాలిక్ మాట్లాడిన వీడియోనూ పోస్ట్ చేశారు. ఆయన గతంలో జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారివద్ద నుంచి ఛార్జీలు వసూలు చేసి, యాజమాన్య హక్కులను అందించడం లక్ష్యంగా ఫరూఖ్ అబ్దుల్లా ప్రభుత్వం గతంలో రోష్ని చట్టాన్ని తీసుకొచ్చింది. సదరు డబ్బును హైడ్రో పవర్ ప్లాంట్ల స్థాపనకు వినియోగిస్తామని పేర్కొంది. కానీ.. జమ్మూకశ్మీర్ హైకోర్టు దీన్ని చట్టవిరుద్ధమని ప్రకటించింది. లబ్ధిదారులపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో పథకం రద్దయింది.