రాజకీయ ఖైదీలను విడుదల చేయండి: ముఫ్తీ

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌తోపాటు, ఇతర ప్రాంతాల్లోని జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు. ఈ కష్టకాలంలో వారంతా కుటుంబ సభ్యులతో ఉండాల్సిన అవసరముందని...

Published : 07 May 2021 23:14 IST

శ్రీనగర్‌: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌తోపాటు, ఇతర ప్రాంతాల్లోని జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు. ఈ కష్టకాలంలో వారంతా కుటుంబ సభ్యులతో ఉండాల్సిన అవసరముందని ఆమె అన్నారు.  కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు పెరోల్‌పై ఖైదీలను విడుదల చేస్తున్నాయని ముఫ్తీ గుర్తు చేశారు. కానీ, ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మాత్రం అది జరగడం లేదన్నారు. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా కుటుంబంతో గడిపే అవకాశమివ్వాలన్నారు. కొవిడ్‌ ప్రళయాన్ని రాజకీయం చేయొద్దని కోరారు.

‘‘ఇది మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం. కుల, మతాలు, సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ కరోనా వైరస్‌ ప్రభావితం చేస్తోంది. కుల, మత వర్గాలను వీడి భారతీయులంతా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఖైదీలు సరైన వైద్యం అందక జైళ్లలోనే మరణిస్తున్నారనే వార్తలు నన్ను కలచివేస్తున్నాయి. వెంటనే రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి’’అని ముఫ్తీ తన లేఖలో పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్‌కు స్వయం పత్రిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆగస్టు 2019 నుంచి వేల మంది పౌరులను పోలీసులు అరెస్టు చేశారని, వారందరినీ జమ్ము కశ్మీర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బంధించారని ముఫ్తీ అన్నారు. వారిలో చాలా మంది ఎలాంటి నేరం చేయలేదని, ముందస్తు జాగ్రత్తలో భాగంగానే వారిని అరెస్టు చేశారని తెలిపారు. కోర్టుల నుంచి బెయిలు తెచ్చుకున్నా జైలు నుంచి విడుదల కానివారెందరో ఉన్నారని ఆమె ఈ  సందర్భంగా తెలిపారు. ప్రధాని మోదీ ఈ అంశంపై దృష్టిపెడతారని, రాజకీయ ఖైదీలను విడుదల చేసేలా ఆదేశాలిస్తారని ముఫ్తీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని