Shraddha Walker: ఆఫ్తాబ్‌కు ‘నార్కో టెస్ట్‌’ పూర్తి

శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలాకు నేడు నార్కో టెస్టు పూర్తిచేశారు.  పరీక్షకు ఆఫ్తాబ్‌ అంగీకరించడంతో ఆయన్ను సుమారు రెండు గంటల పాటు దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

Published : 01 Dec 2022 16:47 IST

దిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ (Shraddha Walker) హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ ఆమిన్‌ పూనావాలాకు (Aaftab Poonawala) నార్కో అనాలసిస్‌ పరీక్షలు పూర్తయ్యాయి. దిల్లీ ఆసుపత్రిలో ఆయనకు రెండు గంటలపాటు నార్కో పరీక్ష కొనసాగింది. పరీక్ష  ముగిసిందని.. ఆ సమయంలో ఆఫ్తాబ్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అధికారులు వెల్లడించారు.

శ్రద్ధా (Shraddha Walker) హత్య కేసు దర్యాప్తు జరుపుతోన్న అధికారులు.. వాస్తవాలను నిర్ధారించుకునేందుకు నిందితుడు ఆఫ్తాబ్‌కు ఇప్పటికే పాలిగ్రాఫ్‌ నిర్వహించారు. నార్కో పరీక్ష చేసేందుకు గాను గురువారం ఉదయం 8.40గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారు. టెస్ట్‌ గురించి ఆఫ్తాబ్‌ కు వివరించిన నిపుణుల బృందం.. అతడి అంగీకారం తీసుకుంది. అనంతరం 10గంటలకు నార్కోటెస్ట్‌ మొదలుపెట్టిన అధికారులు.. సుమారు రెండు గంటలపాటు నిందితుడిని ప్రశ్నించినట్లు సమాచారం. నార్కో టెస్ట్‌ విజయవంతంగా ముగిసిన అనంతరం అతన్ని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు.

మరోవైపు శ్రద్ధా వాకర్‌ను (Shraddha Walker) అత్యంత దారుణంగా హతమార్చినట్లు నిందుతుడు విచారణలో అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.  ఇటీవల నిర్వహించిన పాలిగ్రాఫ్‌ టెస్టులోనూ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పాలిగ్రాఫ్‌ టెస్టు సమయంలో శ్రద్ధాను తానే హత్య చేశానని.. అందుకు తనకేమీ పశ్చాత్తాపం, బాధ లేదని చెప్పినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. హత్య తర్వాత శ్రద్ధాను ముక్కలు చేసి ఆమె శరీర భాగాలను అడవిలో పడేసిన విషయాన్ని కూడా  పాలిగ్రాఫ్‌ సెషన్‌లో చెప్పినట్లు తెలిసింది. తాజాగా నార్కో టెస్టు కూడా పూర్తి కావడంతో త్వరలోనే ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని