Shraddha murder: శ్రద్ధా హత్య కేసు.. బెయిల్‌ వద్దన్న ఆఫ్తాబ్‌.!

తనకు జైల్లో రక్షణ లేదని, బెయిల్ ఇవ్వాలని శ్రద్ధా హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా పేరుతో ఇటీవల కోర్టులో బెయిల్ పిటిషన్‌ దాఖలైంది. అయితే సమాచారలోపం కారణంగా ఆ పిటిషన్‌ దాఖలైందని ఆఫ్తాబ్ తెలిపాడు. దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు చెప్పాడు.

Updated : 22 Dec 2022 12:12 IST

దిల్లీ: సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ (Shraddha Walkar) హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా (Aaftab Poonawala) తన బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు. సమాచార లోపం కారణంగానే ఆ పిటిషన్‌ను దరఖాస్తు చేసినట్లు ఆఫ్తాబ్‌ కోర్టుకు తెలిపాడు. దీంతో అతడి అభ్యర్థనను న్యాయస్థానం కొట్టివేసింది.

ఈ కేసులో బెయిల్‌ కోరుతూ ఆఫ్తాబ్‌ తరఫున న్యాయవాది డిసెంబరు 15న కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, అది బెయిల్‌ పిటిషన్‌ అని తనకు తెలియదని, పొరబాటుగా దాఖలైందని ఆ తర్వాత నిందితుడు కోర్టుకు తెలిపాడు. దీనిపై దిల్లీలోని సాకేత్‌ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. సమాచారలోపం కారణంగానే ఈ పిటిషన్‌ను దరఖాస్తు చేసినట్లు అఫ్తాబ్ న్యాయవాది చెప్పారు. ఈ దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిందితుడు నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి బృందా కుమారి తెలిపారు. కాగా.. అంతకుముందు ఈ పిటిషన్‌కు దిల్లీ పోలీసులు సమాధానమిచ్చారు. ఇది అత్యంత తీవ్రమైన నేరమని, సమాజంపై పెను ప్రభావం చూపించిందని పోలీసులు పేర్కొన్నారు. అందువల్ల, అతడికి బెయిల్‌ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు. ఇటీవల ఆఫ్తాబ్‌ను పాలిగ్రాఫ్‌ పరీక్షల నిమిత్తం జైలు నుంచి బయటకు తీసుకురాగా.. పోలీసు వాహనంపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. అతడు బయటకు వస్తే మళ్లీ అతడిపై దాడి జరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. కోర్టులో కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే హాజరుపరుస్తున్నారు.

తన సహజీవన భాగస్వామి అయిన శ్రద్ధా వాకర్‌ను చంపి, ఆమె శరీరాన్ని అతి దారుణంగా ముక్కలు చేసిన ఆఫ్తాబ్‌ను దిల్లీ పోలీసులు గత నెల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే నిందితుడికి పాలిగ్రాఫ్‌, నార్కో పరీక్షలు కూడా చేశారు. ఆఫ్తాబ్‌ చెప్పిన వివరాల ఆధారంగా.. మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మానవ అవశేషాలను గుర్తించారు. ఆ శరీర భాగాలు శ్రద్ధావేనని డీఎన్‌ఏ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఇక నిందితుడి ఇంట్లో గుర్తించిన రక్త నమూనాలు కూడా మృతురాలివేనని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇంకా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదు. ప్రస్తుతానికి నిందితుడు జ్యుడిషియల్‌ కస్టడీలో తిహాడ్‌ జైల్లో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని