Mehul Choksi: మెహుల్ ఛోక్సీపై రెడ్‌కార్నర్‌ నోటీసులు ఎత్తివేసిన ఇంటర్‌పోల్‌!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసులో దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని ఇంటర్‌పోల్‌ అధికారులు రెడ్‌కార్నర్‌ లిస్ట్‌ నుంచి తొలగించినట్లు సమాచారం. దీనిపై భారత్‌ ఇంకా స్పందించలేదు.   

Published : 21 Mar 2023 01:16 IST

దిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం(PNB Scam)లో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ(Mehul Choksi)పై జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీసులను ఇంటర్‌పోల్‌(Interpol) అధికారులు తొలగించినట్లు సమాచారం. లియోన్‌లోని ఇంటర్‌పోల్‌ ఏజెన్సీకి ఆయన చేసుకున్న విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐ, భారత్‌లోని ఇంటర్‌పోల్‌ నోడల్‌ ఏజెన్సీకానీ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. రెడ్‌ కార్న్‌ నోటీసులు జారీ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లో ఎక్కడున్నా నిందితులను పట్టుకొని, అరెస్టు చేసే అధికారం ఇంటర్‌పోల్‌ అధికారులకు ఉంటుంది. ఈ నిర్ణయంతో ఛోక్సీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. 

రూ.13,000 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడు  మెహుల్‌ చోక్సీపై 2018లో ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులను జారీ చేసింది. అప్పటికే ఛోక్సీ దేశం విడిచి పారిపోయారు. 2017లోనే ఛోక్సీ ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకుని 2018 నుంచి ఆ దేశంలోనే ఉంటున్నాడు. ఛోక్సీ పౌరసత్వం రద్దు చేయాలని భారత్‌.. ఆంటిగ్వాను కోరినప్పటికీ అందుకు ఆ దేశం ఒప్పుకోలేదు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అతడికి పౌరసత్వం ఇచ్చామని చెప్పుకుంటూ వస్తోంది. బ్యాంకులను మోసం చేసిన తర్వాత మెహుల్‌ ఛోక్సీ భారత్‌ నుంచి పరారయ్యాడు. విదేశాల్లో ఉన్న అతడిని తీసుకొచ్చేందుకు భారత్‌ తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరిగా గత ఏడాది డొమినికాలో పోలీసులకు చిక్కిన విషయం తెలుసుకున్న భారత్‌ అధికారులు అతడిని ఇక్కడికి రప్పించేందుకు యత్నించారు. ఈ మేరకు డొమినికాతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే అవన్ని విఫల ప్రయత్నాలుగానే మిగిలాయి. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని