Mehul Choksi: ఇంత కథ నడిచిందా..!

బలహీన చట్టాలను అవకాశంగా చేసుకొని.. ఆర్థిక లబ్ధి ఆశచూపి భారత్‌కు రాకుండా ఉండేందుకు మెహుల్‌ ఛోక్సీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఛోక్సీని భారత్‌కు పంపకుండా అడ్డుకోవడం వెనుక....

Published : 07 Jun 2021 01:08 IST

ఎన్నికల నిధులు అందిస్తామని ప్రతిపక్షంపై ఒత్తిడి

చక్రం తిప్పిన చోక్సీ సోదరుడు

డొమినికాలో దొరికిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ భారత్‌కు రావడమే తరువాయి అన్న క్షణంలో ఒక్కసారిగా అంతా మారిపోయింది. నిమిషాల వ్యవధిలో తేల్చాల్సిన కేసును కూడా డొమినికన్ కోర్టు వాయిదా వేసింది. చోక్సీ కోసం వెళ్లిన ప్రైవేటు జెట్, భారత ఆధికారుల బృందం స్వదేశానికి తిరిగి వచ్చేసింది. ఈ క్రమంలో తెరవెనుక ఏదో జరిగిందన్న అనుమానాలకు తావిస్తుండగా.. ఆ మంత్రాంగాన్ని ఎవరు నడిపారన్నదానిపై అందరి దృష్టి నిలిచింది. చోక్సీ అప్పగింత జాప్యంలో డొమినికా ప్రతిపక్షాలు ప్రధాన పాత్ర పోషించాయి. వాటి ఒత్తిడికి ఏకంగా ఆ దేశ న్యాయవ్యవస్థే తలొగ్గింది. ఇదంతా చక్కబెట్టింది చోక్సీ సోదరుడు చింటూభాయ్ అని తెలుస్తోంది. అసలు ఈ ఆర్థిక నేరస్థులు ఇంతగా బరితెగించడానికి మన దేశంలోని బలహీన చట్టాలే కారణమని కొందరు న్యాయ కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు.

బలహీన చట్టాలను అవకాశంగా చేసుకొని.. ఆర్థిక లబ్ధి ఆశచూపి భారత్‌కు రాకుండా ఉండేందుకు మెహుల్‌ చోక్సీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా చోక్సీని భారత్‌కు పంపకుండా అడ్డుకోవడం వెనుక ఆ దేశ ప్రతిపక్షాల పాత్ర ఉందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. చోక్సీ తరఫు న్యాయవాదుల బృందం డొమినికా ప్రతిపక్ష నేతలతో సమావేశమై.. వారి ద్వారా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి అతడిని వెంటనే భారత్‌కు తరలించే అవకాశాన్ని అడ్డుకుంది. చోక్సీ అంటిగ్వా నుంచి అక్రమంగా డొమినికాలో ప్రవేశించలేదని.. అతడిని అపహరించారన్న వాదనలతో ప్రతిపక్ష నేతలను న్యాయవాదులు ఒప్పించారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ కేసును వెంటనే తేల్చే అవకాశం ఉన్నా.. డొమినికన్‌ న్యాయస్థానం విచారణను వాయిదావేసింది. వెంటనే తేలాల్సిన కేసు వాయిదా పడటంతో ఇది మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు. 

చింటూభాయ్‌ హామీతో న్యాయవ్యవస్థపై ఒత్తిడి
చోక్సీ తరఫున వాదిస్తున్న లండన్‌కు చెందిన నలుగురు న్యాయవాదుల బృందం.. చోక్సీ సోదరుడు చేతన్‌ చింటూభాయ్‌ చోక్సీ సాయంతో కథ నడిపించినట్లు తెలుస్తోంది. మెహుల్‌ చోక్సీని కిడ్నాప్‌ చేశారన్న కథను ప్రారంభించిన చింటూభాయ్‌.. డొమినికన్‌ ప్రతిపక్ష నేతకు ఎన్నికల నిధులు ఇస్తానని హామీ కూడా ఇచ్చినట్లు స్థానిక మీడియా సహా మెహుల్‌  బంధువు ఒకరు తెలిపారు. డొమినికా విపక్ష నేత లెనాక్స్‌ లింటన్‌ను చింటూభాయ్‌ కలిసి తన సోదరుడిని భారత్‌కు అప్పగించకుండా డొమినికా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరినట్లు తెలిసింది. ఈ పని చేస్తే వచ్చే ఎన్నికల ఖర్చుకు నిధులిస్తామని చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. చింటూభాయ్‌ ఆర్థిక హామీతో ప్రతిపక్ష నేత న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి చోక్సీని భారత్‌కు పంపకుండా అడ్డుకున్నాడని తెలుస్తోంది. అందుకే ఈ వజ్రాల వ్యాపారికి వ్యతిరేకంగా అనేక బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ డొమినికన్‌ కోర్టు అతడిని భారత్‌ పంపకుండా కేసును వాయిదా వేసింది.

ఇలా అయితే చోక్సీని తీసుకురావడం కష్టమే
చోక్సీని భారత్‌కు తీసుకురావడం కష్టసాధ్యమని న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు. స్వార్థపూరిత ఆర్థిక లబ్ధి, బలహీన చట్టాలు ఆర్థిక నేరగాళ్లకి వరంగా మారుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. చోక్సీ వంటి ఆర్థిక నేరగాళ్లు మన చట్టాలను అపహాస్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పేర్కొన్నారు. మెహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యా, లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ లాంటివారిని భారత చట్టాలతో తిరిగి భారత్‌కు తీసుకురావడం కష్టమని.. ఎందుకంటే అవి చాలా బలహీనంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక నేరస్థులు ఫ్రాన్స్‌, సింగపూర్‌, అమెరికా, జర్మనీ, చైనా వంటి దేశాల్లో జన్మించి ఉంటే వారికి మరణశిక్ష విధించేవారని.. ఆస్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకునేవారని పేర్కొన్నారు. 

చట్టాల సంస్కరణ అవసరం..
చట్టాలను సంస్కరించాల్సిన అవసరం ఉందన్న అశ్విని ఉపాధ్యాయ.. ఇప్పటివరకు ఏ ఒక్క ఆర్థిక నేరగాడి ఆస్తిని వందశాతం స్వాధీనం చేసుకోలేదని, ఒక్కరికి కూడా జీవిత ఖైదు లాంటి కఠిన శిక్ష పడలేదని గుర్తుచేశారు. సంస్కరణలు ప్రారంభించకపోతే చోక్సీని తిరిగి తీసుకొచ్చినా.. అతడు బలహీన చట్టాలను ఆశ్రయిస్తాడని తెలిపారు. భారత్‌ నుంచి పారిపోయి 2018 జనవరిలో ఆంటిగ్వా పౌరసత్వం పొందిన చోక్సీపై ఇప్పటికే రెడ్‌ కార్నర్‌ నోటీసు అమల్లో ఉంది. అవాస్తవాలతో చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వం పొందాడని.. అతడి పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ కోరుతున్నారు. చోక్సీని తిరిగి భారత్‌కు పంపాలని ఆయన ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని