Jamal Khashoggi: జమాల్‌ హంతకులకు అమెరికాలో శిక్షణ

వాషింగ్టన్ పోస్ట్‌ కాలమిస్ట్‌ జమాల్‌ ఖషోగీ హత్యలో పాల్గొన్న హంతకులు అమెరికాలోనే శిక్షణ పొందినట్లు తేలింది. ఈ విషయాన్ని న్యూయార్క్‌టైమ్స్‌ వెలుగులోకి తెచ్చింది

Published : 23 Jun 2021 16:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాషింగ్టన్ పోస్ట్‌ కాలమిస్ట్‌ జమాల్‌ ఖషోగీ హత్యలో పాల్గొన్న హంతకులు అమెరికాలోనే శిక్షణ పొందినట్లు తేలింది. ఈ విషయాన్ని న్యూయార్క్‌టైమ్స్‌ వెలుగులోకి తెచ్చింది. ఈ హత్యలో పాల్గొన్న నలుగురు హంతకులకు అమెరికాలోని టైర్‌ 1 గ్రూప్‌ అనే ప్రైవేటు భద్రతా సంస్థ నుంచి 2014లో పారామిలటరీ శిక్షణ లభించింది. దీనికి నాటి అధ్యక్షుడు ఒబామా కార్యవర్గం ఆమోద ముద్ర కూడా వేసింది. వీరి శిక్షణ ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగినట్లు ఆ పత్రిక పేర్కొంది. 

టైర్‌ 1 గ్రూప్‌ కంపెనీకి మాతృ సంస్థ అయిన సెర్బరస్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలోని లూయిస్ బెర్మర్‌ అనే అత్యున్నత అధికారి పెంటగాన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ఈ శిక్షణకు సంబంధించిన పత్రాలు సమర్పించారు. ఇప్పుడు అవి వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. ఇది నిజమైన పత్రమే అని లూయిస్‌ కూడా ధ్రువీకరించారు. కాకపోతే టైర్‌ 1 గ్రూప్‌ ఆత్మరక్షణకు సంబంధించిన శిక్షణ మాత్రమే ఇచ్చిందని ఆయన వివరించారు. ఆ హంతకులు తర్వాత చేసిన పనితో సంబంధం లేదని పేర్కొన్నారు. లూయిస్‌ కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు 2014-15 వరకు, ఆ తర్వాత ఆ ఇద్దరితో పాటు మరో ఇద్దరు వచ్చి 2017లో శిక్షణ తీసుకొన్నట్లు తెలుస్తోంది.

హత్యకు గురైన వాషింగ్టన్‌ పోస్ట్‌ కాలమిస్టు జమాల్‌ ఖషోగీ ఒకప్పుడు సౌదీ రాజకుటుంబానికి సన్నిహితుడు. కానీ ఆ తర్వాత వారిని వ్యతిరేకిస్తూ అమెరికా పారిపోయాడు. అక్కడి నుంచి సౌదీ కుటుంబంపై కథనాలు రాసేవాడు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో గల సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో 2018 అక్టోబరు 2న ఖషోగీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌(ఎంబీఎస్‌) హస్తం ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్‌ విభాగం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఎంబీఎస్‌ అనుమతి లేకుండా సిబ్బంది ఇలాంటి ఆపరేషన్లు చేపట్టే అవకాశం లేదని పేర్కొంది. ఈ నివేదికను కాంగ్రెస్‌లో సమర్పించిన తర్వాత సౌదీపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి చెందిన 76 మంది వ్యక్తులపై ‘ఖషోగీ బ్యాన్‌’ పేరుతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వీసా ఆంక్షలు విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని