menstrual leaves: నెలసరి సెలవులు మంచివే కానీ.. ప్రతికూల అంశాలూ ఉన్నాయి

మహిళా ఉద్యోగుల నెలసరి సెలవుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, ఈ అంశంపై కేంద్రమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

Published : 09 Jul 2024 03:47 IST

సుప్రీంకోర్టు వ్యాఖ్య

దిల్లీ: మహిళా ఉద్యోగుల నెలసరి సెలవుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, ఈ అంశంపై కేంద్రమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సెలవులకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేస్తే, అది మహిళలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి సంస్థల యజమానులు ఇష్టపడకపోవచ్చని వ్యాఖ్యానించింది. దీనిపై రాష్ట్రాలు, ఇతర వాటాదారులతో చర్చించి కేంద్రమే ఒక విధానం రూపొందించాలని  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు నెలసరి సెలవులు మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ‘‘ఇందులో రెండు పార్శ్వాలు ఉన్నాయి. నెలసరి సెలవులు ఇస్తే ఉద్యోగాల్లో చేరేందుకు మరింతమంది మహిళలను ప్రోత్సహించినట్లవుతుంది. అయితే, వీటిని తప్పనిసరి చేయాలని యజమానులను బలవంతపెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారితీయొచ్చు. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు కూడా తగ్గొచ్చు. అది మేం కోరుకోవట్లేదు. దీనిపై విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలి. ఎందుకంటే మహిళల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారొచ్చు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

మరో 2 నెలల గడువు కావాలి

పాఠశాలల్లో చదువుతున్న బాలికల రుతుక్రమ పరిశుభ్రతపై కాంగ్రెస్‌ నేత జయాఠాకుర్‌ వేసిన పిటిషన్‌ కూడా సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి.. జాతీయ విధానం రూపొందించే క్రమంలో ఉన్నామని.. పూర్తవ్వడానికి మరో రెండు నెలలు సమయం పడుతుందని తెలిపారు. పాఠశాలకు వెళ్లే బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు అందివ్వాలని, ప్రభుత్వ ఎయిడెడ్, రెసిడెన్షియల్‌ పాఠశాల్లో ప్రత్యేకంగా మహిళలకు మరుగుదొడ్లు ఉండాలని జయాఠాకుర్‌ తన పిటిషన్‌లో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని