Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’

‘హర్‌ ఘర్‌ తిరంగా’ (ఇంటింటా త్రివర్ణం) కార్యక్రమం చేపట్టిన కేంద్ర ప్రభుత్వంపై శివసేన నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శలు గుప్పించారు........

Published : 14 Aug 2022 02:29 IST

శివసేన నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శ

ముంబయి: ‘హర్‌ ఘర్‌ తిరంగా’ (ఇంటింటా త్రివర్ణం) కార్యక్రమం చేపట్టిన కేంద్ర ప్రభుత్వంపై శివసేన నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శలు గుప్పించారు. కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల మీరు దేశభక్తులు కాలేరంటూ వ్యాఖ్యానించారు. దేశభక్తి గుండెల్లో ఉండాలన్నారు. ఈ కార్యక్రమం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగమని తాను అర్థం చేసుకున్నానని.. అయితే 75 సంవత్సరాల తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఎంతవరకు మిగిలిందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

తన తండ్రి బాలా సాహెబ్‌ ఠాక్రే 1960లో ప్రారంభించిన కార్టూన్‌ మ్యాగజైన్‌ ‘మాలిక్‌’ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్ధవ్‌ వీడియో లింక్ ద్వారా మాట్లాడారు.ప్రజలు బానిసత్వం వైపు మళ్లకుండా కార్టూనిస్టులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా భాజపాను తీవ్రంగా విమర్శించారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరేయాలని ఈ రాచరిక ప్రభుత్వం ప్రజలను కోరిందని, అయితే ఇందుకు సంబంధించిన ఓ కార్టూన్‌ను ఒకరు తనకు చూపించారన్నారు. అందులో ‘నా దగ్గర జెండా ఉంది. కానీ ఎగరేసేందుకు నాకు ఇల్లే లేదు’ అని పేదవాడు వాపోయినట్లు ఉద్ధవ్‌ పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమం చేపడితే బాగుండేదని ఎద్దేవా చేశారు.

సాయుధ బలగాలకు బడ్జెట్‌లో కోత పెట్టాలని భాజపా భావిస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ‘త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టడం ఆనందంగా ఉంది, కానీ దేశాన్ని రక్షించడానికి తమ వారిని ఇళ్లను వదిలి సరిహద్దుల్లో కాపలాకాస్తున్న వారి బడ్జెట్‌ను తగ్గించడం గురించి మాట్లాడటం దురదృష్టకరం. సైన్యంలో మనుషులను తగ్గిస్తే ఆయుధాలు ఎవరికి ఇస్తారు?’ అంటూ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని