
ఆ దేశంలో 40 శాతం మందికి పైగా కరోనా!
కరోనా మరణాల్లో మూడోస్థానంలో మెక్సికో
దిల్లీ: మెక్సికోలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జనాభా పరంగా పదో స్థానంలో ఉన్న ఈ దేశంలో.. రెండో స్థానంలో ఉన్న భారత్ కంటే ఎక్కువగా కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. తాజాగా, ఈ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.
90 శాతం నిండిన ఆస్పత్రులు..
అధికారిక గణాంకాల ప్రకారం గురువారం నాటికి భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య కోటి 7 లక్షలకు, మృతుల సంఖ్య లక్షా 54 వేలకుపైగా ఉంది. కాగా, ప్రముఖ గణాంకాల సంస్థ వరల్డోమీటర్ వివరాల ప్రకారం.. భారత్‌తో పోలిస్తే మెక్సికోలో కొవిడ్ కేసుల సంఖ్య తక్కువగా (18 లక్షల 25 వేలు) ఉన్నప్పటికీ, మరణాలు మాత్రం లక్షా 55 వేలకు పైగా నమోదయ్యాయి. దీంతో మరణాల విషయంలో మెక్సికో భారత్‌ను దాటేసి.. మూడో స్థానానికి చేరిపోయింది. అధికారిక లెక్కల ప్రకారమే ఇక్కడి ప్రజల్లో 40 శాతం మందికి పైగా కరోనా సోకింది. రాజధాని మెక్సికో నగరంలోని ఆస్పత్రులు 90 శాతానికి పైగా కొవిడ్ రోగులతో నిండిపోయాయి. ఇక మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఇది 70 శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ దేశంలో వారాల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కాగా, వెల్లడైన సంఖ్య కంటే, నమోదు కాకుండా ఉన్న కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చని ఆ దేశ అధికారులే అంటున్నారు.
ఎందుకిలా?
కరోనా కట్టడిలో భాగంగా భారత్ సహా అనేక దేశాలు మొదట్లోనే లాక్‌డౌన్‌ను విధించాయి. బ్రిటన్ తదితర దేశాలు ఈ నిబంధనలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. ఐతే, మెక్సికో అధ్యక్షుడు మాన్యుయెల్ లోపెజ్ లాక్‌డౌన్‌పై సానుకూలంగా లేరు. ఈ వైఖరి కారణంగానే కరోనా తొలుత విజృంభించిన ఇటలీ, స్పెయిన్, అమెరికా, భారత్ వంటి దేశాలను కూడా దాటేసిన మెక్సికో.. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితికి చేరుకుంది. కొవిడ్ మరణాల విషయంలో అమెరికా (4,43,769), బ్రెజిల్ (2,21,676) తర్వాత ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది.
ఇంతజరుగుతున్నా.. మాస్కు, సామాజిక దూరం తదితర నిబంధనలను పాటించాలంటూ విజ్ఞప్తి చేయటమే తప్ప, మెక్సికో వాటిని తప్పనిసరి చేయకపోవటం గమనార్హం. కరోనా సోకకుముందు స్వయానా ఆ దేశ అధ్యక్షుడే విమానాల్లో మాస్కు లేకుండా ప్రయాణిస్తున్న అనేక చిత్రాలు వెలువడ్డాయి. కాగా, ఈ దేశంలో డిసెంబర్ నెలాఖరులో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.