Corona: మార్చి 31 నుంచి దేశంలో కొవిడ్‌ నిబంధనలు ఎత్తివేత, కానీ,

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను

Updated : 23 Mar 2022 19:09 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నేడు సమాచారమిచ్చారు.

దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిల్లో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

‘‘కరోనా పరిస్థితుల్లో మెరుగుదలతో పాటు మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా తమ సామర్థ్యాన్ని పెంచుకొని సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అటు కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఓ నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ కట్టడికి విపత్తు నిర్వహణ చట్టం కింద ఉన్న నిబంధనలు మరింతకాలం పొడగించాల్సిన అసవరం లేదని భావిస్తున్నాం. మార్చి 31న ప్రస్తుతమున్న ఆంక్షల గడువు ముగియనుంది. ఆ తర్వాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయబోదు’’ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా.. రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ప్రజలంతా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హోంశాఖ సూచించింది. వైరస్‌ తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం గనుక, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భల్లా అన్నారు. అయితే, కేసుల సంఖ్య పెరిగితే.. స్థానిక ప్రభుత్వాలు తిరిగి నిబంధనలు విధించే అంశాన్ని పరిశీలించవచ్చన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని