MHA: మణిపుర్‌ హింసాత్మక ఘటనలు..! శాంతి స్థాపనకు కమిటీ ఏర్పాటు

అల్లర్లతో అట్టుడుకుతోన్న మణిపుర్‌లో శాంతి స్థాపన దిశగా కేంద్రం ఓ కమిటీని నియమించింది. జాతుల మధ్య శాంతి స్థాపన ప్రక్రియను సులభతరం చేసేందుకు, వారి మధ్య చర్చల నిర్వహణకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

Published : 10 Jun 2023 16:45 IST

ఇంఫాల్: హింసాత్మక ఘటనలతో మణిపుర్‌ (Manipur) అట్టుడికిపోతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం సైతం తూటా గాయాలతో ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరోవైపు.. రాష్ట్రంలో శాంతి స్థాపన దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ (MHA) తాజాగా ఓ కమిటీ (Manipur Peace Committee)ని నియమించింది. మణిపుర్‌ గవర్నర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ శాంతి స్థాపన కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు సభ్యులుగా ఉంటారని పేర్కొంది. జాతుల మధ్య శాంతి స్థాపన ప్రక్రియను సులభతరం చేసేందుకు, వారి మధ్య చర్చల నిర్వహణకు ఈ కమిటీ చొరవ తీసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మణిపుర్‌లో పర్యటించి, పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు శనివారం ప్రకటన జారీ అయ్యింది. పౌరుల మధ్య సామాజిక ఐక్యత, పరస్పర అవగాహనను శాంతి కమిటీ బలోపేతం చేస్తుందని హోంశాఖ తెలిపింది. జాతుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మణిపుర్‌లో మే 3 నుంచి దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు సుమారు 100 మంది చనిపోగా, 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనలు, దోపిడీలు, ఆస్తుల విధ్వంసం వెనుకున్న కుట్రను బహిర్గతం చేసేందుకు సీబీఐ ఇప్పటికే 10 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని