ఆ దేశంలో కరోనా వైరస్ తొలి కేసు..

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో వణికిపోతుంటే.. పసిఫిక్ మారుమూల దేశమైన మైక్రోనేషియాలో సోమవారం తొలి కొవిడ్ కేసు వెలుగుచూసింది.

Published : 11 Jan 2021 13:17 IST

 

పలికిర్: ప్రపంచమంతా కరోనా వైరస్‌తో వణికిపోతుంటే.. పసిఫిక్ మారుమూల దేశమైన మైక్రోనేషియాలో సోమవారం తొలి కొవిడ్ కేసు వెలుగుచూసింది. దీంతో ఆ దేశం భూమిపై కొవిడ్ చొరబడని ప్రాంతంగా ఉన్న గుర్తింపును కోల్పోయింది. ఇది ఆందోళనకర పరిణామమని మైక్రోనేషియా అధ్యక్షుడు డేవిడ్ పాన్యులో ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ కేసును సరిహద్దుల వద్దే కట్టడి చేశామని వెల్లడించారు. ‘పరిస్థితులు అదుపులో ఉన్నందున, ప్రజలు భయపడవద్దు’ అని సుమారు లక్ష మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన భరోసా ఇచ్చారు. ఫిలిప్పైన్స్‌లో మరమ్మతులో ఉన్న ప్రభుత్వ నౌకలోని సిబ్బందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. ఈ మొదటి కేసు బయటపడింది. వైరస్ సోకిన వ్యక్తితో పాటు తోటి వారు కూడా ఆ నౌకలోనే నిర్బంధంలో ఉన్నారని తెలిపారు. అలాగే వ్యాపారాలు, పాఠశాలలు, చర్చిలు తెరిచే ఉంటాయన్నారు.

పసిఫిక్ ద్వీప దేశాలు కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో చురుగ్గా వ్యవహరించాయి. మహమ్మారి తన ఉనికిని చాటడం ప్రాంభించినప్పుడే సరిహద్దులను మూసివేసి, వైరస్‌ను కట్టడి చేయడంలో విజయవంతమయ్యాయి. పర్యాటకంపై ఆధారపడిన ఆ దేశాలు ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చినప్పటికీ, వెనక్కి తగ్గలేదు. కొంతకాలంగా ఒక్కో దేశంలో వైరస్ జాడలు కనిపిస్తున్నాయి. వనౌటు, సాల్మన్, మార్షల్, సమోవా, తాజాగా మైక్రోనేషియా వైరస్ చొరబడని ప్రాంతాలుగా ఉన్న గుర్తింపును కోల్పోయాయి. అయితే, సమూహ వ్యాప్తి ఉన్నట్లు మాత్రం దాఖలాలు లేవు. కిరిబటి, నౌరు, పలావు, టోంగా, తువలు వంటి దేశాల్లో మాత్రం ఇప్పటివరకు మహమ్మారి ఛాయలు కానరాలేదు. ఈ దేశాలు ఇంత జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రధాన కారణాలు వైద్యసదుపాయాల లేమి, ఊబకాయం, గుండెజబ్బుతో బాధపడే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉండటమని నిపుణులు వెల్లడించారు. 

ఇవీ చదవండి:

భారత్‌ కరోనా టీకాలు మంచివే: చైనా

మొదటిసారి 200 దిగువగా మరణాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని