Advitiya Bal: ఆ పైలట్‌ త్యాగానికి.. మనమిచ్చే గౌరవం ఇదేనా?

దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో కన్న కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తెలిసి ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. కుమారుడు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన కుటుంబసభ్యులకు విమానంలో ఇబ్బందికర పరిస్థితి

Updated : 18 Aug 2022 15:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో కన్న కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తెలిసి ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన కుటుంబసభ్యులకు విమానంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని అందరికంటే ముందుగా విమానం నుంచి దింపేందుకు విమాన సిబ్బంది ప్రయత్నించగా.. తోటి ప్రయాణికులు కనీసం పట్టించుకోకపోవడం బాధాకరం.

గత గురువారం రాజస్థాన్‌లో బర్మేర్‌ జిల్లా బాడ్‌మేడ్‌కు సమీపంలో భారత వాయుసేకు చెందిన మిగ్‌ -21 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వింగ్‌ కమాండర్‌ ఎం. రాణా, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ అద్వితీయ బాల్‌ దుర్మరణం చెందారు. జమ్మూకు చెందిన 26 ఏళ్ల అద్వితీయ బాల్‌ మరణవార్త తెలియగానే ఆయన కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది.

కుమారుడి భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకెళ్లేందుకు శుక్రవారం బాల్‌ కుటుంబసభ్యులు దిల్లీ నుంచి జోధ్‌పుర్‌కు ఇండిగో విమానంలో వెళ్లారు. జోధ్‌పుర్‌లో విమానం ల్యాండ్‌ అయిన తర్వాత మూడో వరుసలో కూర్చున్న బాల్‌ కుటుంబసభ్యులు మొదట దిగేందుకు సహకరించాలని కెప్టెన్‌ అనౌన్స్‌ చేశారు. వారి కుమారుడు మిగ్‌ ప్రమాదంలో మరణించారని, వారు త్వరగా దిగేందుకు సహకరించాలని కోరారు. కానీ, ఈ ప్రకటనను ఎవరూ పట్టించుకోలేదు. ముందు వరుసలో కూర్చున్న ప్రయాణికులు వినిపించుకోకుండా దిగడం ప్రారంభించారు.

ఇదే విమానంలో ప్రయాణిస్తోన్న షెర్బీర్‌ పనాగ్‌ అనే ప్రయాణికుడు ఈ విషయాన్ని ట్విటర్‌లో పేర్కొంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘ఫ్లైట్‌ లెఫ్టినెంట్ బాల్‌ కుటుంబసభ్యులు మూడో వరుసలో నా పక్కనే కూర్చున్నారు. విమానం ల్యాండ్‌ అవ్వగానే వారు ముందు దిగేందుకు సహకరించాలని కెప్టెన్‌ పదే పదే కోరారు. అయినా ముందు వరుసలోని వారు వినిపించుకోలేదు. నేను, ఇతర ప్రయాణికులు గట్టిగా అరిచినా పట్టించుకోకుండా స్వార్థంగా ప్రవర్తించారు. ఆ పైలట్ త్యాగానికి మనమిచ్చే గౌరవం ఇదీ!’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ వైరల్‌గా మారింది. కాగా.. రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హెఎస్‌ పనాగ్‌ కుమారుడు, నటి గుల్‌ పనాగ్‌ తమ్ముడే షెర్బీర్‌ పనాగ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని