Published : 12 Aug 2022 10:22 IST

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్య.. మరో వలసకూలీ దారుణ హత్య..!

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో మరోసారి ఉగ్రవాదుల లక్షిత దాడులు మొదలయ్యాయి. గతవారం బిహార్‌కు చెందిన వలసకూలీలపై ముష్కరులు కాల్పులు జరిపి ఓ వ్యక్తిని పొట్టనబెట్టుకోగా.. తాజాగా మరో వలసకూలీ ఉగ్రవాదుల తుపాకులకు బలయ్యాడు. బాందీపొరా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఓ కూలీని ముష్కరులు కాల్చి చంపారు. కశ్మీర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నిన్న అర్ధరాత్రి సమయంలో బాందీపొరాలోని అజాస్‌ ప్రాంతంలో మహమ్మద్‌ అమ్రేజ్‌ అనే ఓ 19 ఏళ్ల వలసకూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అమ్రేజ్‌ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడిని బిహార్‌లోని బెసర్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గతవారం, పుల్వామాలో కొంతమంది బిహార్‌ కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. ఓ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.

కాగా.. జమ్ములో ఓ ఆర్మీ క్యాంప్‌పై ముష్కరులు దాడి చేసిన మరుసటి రోజే వలసకూలీ హత్యకు గురవడం కలకలం రేపుతుంది. గురువారం తెల్లవారుజామున రాజౌరీ జిల్లాలోని పార్ఘల్‌లో ఉన్న ఆర్మీ క్యాంప్‌ వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి యత్నించారు. దీన్ని గమనించిన జవాన్లు కాల్పులు జరిపి ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. అయితే ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని