Hit And Run: ముంబయి హిట్‌ అండ్‌ రన్ కేసు.. ప్రమాదం తర్వాత గర్ల్‌ఫ్రెండ్‌కు 40 సార్లు ఫోన్‌..!

ముంబయి కారు ప్రమాద ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన తర్వాత మిహిర్‌ నుంచి అతడి స్నేహితురాలికి 40 కాల్స్‌ వెళ్లాయని తెలిసింది. 

Updated : 10 Jul 2024 19:35 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శివసేన (Shiv Sena) నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన (Mumbai Hit and Run case) సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి  మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే గర్ల్‌ఫ్రెండ్‌కు 40 సార్లు ఫోన్‌ చేశాడని తాజాగా వెల్లడైంది. తర్వాత ఆటోలో ఆమె ఇంటికి వెళ్లాడని పోలీసులు గుర్తించారు. దాంతో ఆమెను కూడా విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

తాను ప్రయాణిస్తోన్న కారును బాంద్రాలోని కాలా నగర్‌లో వదిలేసి, గోరెగావ్‌లో ఉన్న గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ రెండు గంటలు ఉన్నాడు. తర్వాత ఆమె మిహిర్‌సోదరికి కారు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చింది. మిహిర్ సోదరి వచ్చి, అతడిని బోరివల్లిలోని ఇంటికి తీసుకువచ్చింది. తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి షాపుర్‌లోని రిసార్టుకు వెళ్లిపోయారు. అది ముంబయికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత స్నేహితుడితో పాటు తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడే అతడి స్నేహితుడు 15 నిమిషాల పాటు ఫోన్ ఆన్‌ చేయడంతో లొకేషన్ ట్రేస్‌ చేసిన పోలీసులు మిహిర్‌ను అరెస్టు చేశారు.

ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబయిలోని వర్లీ ప్రాంతంలో మిహిర్‌ (Mihir Shah) మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో మహిళ మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. అతడికి సహకరించిన కొందరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నిందితుడి తండ్రి రాజేశ్‌ షా కూడా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఆదేశాలతో దర్యాప్తును వేగవంతం చేశారు. అతడి ఆచూకీ కోసం 11 ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్‌ షాను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని