IN PICS: ఎంపీలకు కేంద్రం ‘మిల్లెట్‌ లంచ్‌’‌.. మోదీ సహా ప్రముఖుల సందడి!

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఎంపీల కోసం ప్రత్యేకంగా  మిల్లెట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు పాల్గొని చిరుధాన్యాలతో తయారు చేయించిన ప్రత్యేక వంటకాలను ఆరగించారు.

Updated : 20 Dec 2022 18:55 IST

దిల్లీ: భారత్‌ చొరవతో 2023ను ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’(International Millets Year) గా ఐరాస ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ ఎంపీలందరికీ చిరుధాన్యాలతో ప్రత్యేక మిల్లెట్‌ లంచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ లంచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)తో పాటు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, మల్లిఖార్జున ఖర్గే, అధిర్‌ రంజన్‌ చౌధరి, పలువురు కేంద్రమంత్రులు, ఉభయ సభల ఎంపీలు హాజరయ్యారు. ప్రఖ్యాత చెఫ్‌లను రప్పించి వారితో చేయించిన ఈ చిరుధాన్యాల ప్రత్యేక వంటకాలను నేతలంతా ఇష్టంగా ఆరగించారు. చిరుధాన్యాలు తినే సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ లంచ్‌లో ఏర్పాటు చేసిన మెనూ నోరూరిస్తోంది. 

ఈ జాబితాలో బజ్రే కా రబ్డీ సూప్‌, రాగి దోసె, యుచెల్ చట్నీ, కలుహులి, లేహ్‌సన్‌ చట్నీ, చట్నీ పౌడర్‌, కలుపాల్యా, ఖారా బూందీ, ఫాక్స్‌టైల్‌ మిల్లెట్‌ కర్డ్‌రైస్‌, జోల్దా రోటీ, గ్రీన్‌ సలాడ్‌, జోవర్‌ హల్వా, గాజర్‌ కా హల్వా, బజ్రా కీర్‌, బజ్రా కేక్‌ వంటివి ఉన్నాయి. ఈ లంచ్‌ అనంతరం  ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాదిగా గుర్తించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన మిల్లెట్‌ వంటకాల లంచ్‌కు హాజరైనట్టు తెలిపారు. పార్టీలకు అతీతంగా నేతలంతా ఈ లంచ్‌కు హాజరుకావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 

భారత్‌ తీర్మానం మేరకు 2023ను ‘అంతర్జాతీయ చిరుధాన్యాల (మిల్లెట్లు) సంవత్సరం’గా పాటించేందుకు 193 సభ్య దేశాలతో కూడిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వప్రతినిధి సభ మార్చి నెలలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. చిరుధాన్యాల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలపైనా, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంపైనా చైతన్యాన్ని పెంచడమే దీని లక్ష్యం. బంగ్లాదేశ్‌, కెన్యా, నేపాల్‌, నైజీరియా, రష్యా, సెనెగల్‌లతో కలిపి భారత్‌ ఈ తీర్మానాన్ని తీసుకురాగా మరో 70 దేశాలు మద్దతు తెలిపాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని