Hemant Soren: మైనింగ్‌ లీజు వ్యవహారం.. హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంలో ఊరట

అక్రమ మైనింగ్‌ కేసులో ఝార్ఖండ్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం చేసిన అప్పీళ్లను సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది.

Updated : 07 Nov 2022 13:41 IST

దిల్లీ: మైనింగ్ లీజులకు సంబంధించిన వ్యవహారంలో ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అక్రమ మైనింగ్‌ కేసులో ఝార్ఖండ్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సోరెన్‌, ఝార్ఖండ్‌ ప్రభుత్వం చేసిన అప్పీళ్లను సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది.

హేమంత్‌ సోరెన్‌ గతంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనకు తానే ఒక గని లీజును మంజూరు చేసుకున్నారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆరోపణలపై విచారణ జరపాలని ఝార్ఖండ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని విచారణయోగ్య వ్యాజ్యాలుగా పేర్కొంటున్నామని హైకోర్టు జూన్‌ 3న తీర్పు వెలువరించింది.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హేమంత్‌ సోరెన్‌, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టులో విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌ చేసింది. అప్పటిదాకా పెండింగ్‌ పిటిషన్లపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. సోమవారం దీనిపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు తీర్పుపై హేమంత్‌ సోరెన్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘సత్యమేవ జయతే’ అని రాసుకొచ్చారు.

ఈ మైనింగ్ లీజుల వ్యవహారంలో సోరెన్‌పై అనర్హత వేటు వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా కొద్దినెలల క్రితమే ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ తన నిర్ణయాన్ని ఆగస్టు 25న గవర్నర్‌కు పంపించింది. అయితే ఈసీ నిర్ణయాన్ని ఇప్పటివరకు గవర్నర్‌ బహిర్గతం చేయకపోవడం గమనార్హం. మరోవైపు ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన ఈడీ.. ఇటీవల సోరెన్‌కు సమన్లు పంపించింది. అయితే సోరెన్‌ మాత్రం విచారణకు హాజరుకాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని