OTT: స్వేచ్ఛ అనేది క్రియేటివిటీకి మాత్రమే.. అశ్లీలతకు కాదు..! అనురాగ్‌ ఠాకూర్‌

స్వేచ్ఛ అనేది కేవలం సృజనాత్మకత కోసమేనని.. అశ్లీలతకు కాదని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ (Anurag Thakur) స్పష్టం చేశారు.

Published : 20 Mar 2023 00:22 IST

దిల్లీ: ఓటీటీల్లో (OTT) వచ్చే కొన్ని చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు (Web Series) అసభ్యకరంగా ఉంటున్నాయని విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ (Anurag Thakur) మరోసారి ఘాటుగా స్పందించారు. స్వేచ్ఛ అనేది కేవలం సృజనాత్మకత కోసమేనని.. అశ్లీలతకు కాదని స్పష్టం చేశారు. అవధులు దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వెనకాడదని ముందస్తు హెచ్చరిక చేశారు.

‘కేవలం సృజనాత్మకత కోసమే డిజిటల్‌ వేదికలకు స్వేచ్ఛ ఇచ్చారు. అశ్లీలత, అసభ్యకరపదజాలం వాడేందుకు కాదు. అటువంటి వాటికి పాల్పడితే సహించేది లేదు. ఓటీటీ వేదికలపై అసభ్యకరమైన పదజాలం, అశ్లీల కంటెంట్‌పై ఫిర్యాదులు రావడంపై ప్రభుత్వం సీరియస్‌గానే ఉంది. ఇందులో మార్పులు తీసుకురావడానికి నిబంధనల్లో ఏమైనా మార్పులు అవసరమవుతాయా అనే కోణాన్ని ఐటీశాఖ పరిశీలిస్తుంది’ అని సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు.

ఇటీవల ఓటీటీలో విడుదలైన ఓ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన కేసు విచారణ సమయంలో దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘కాలేజీ రొమాన్స్‌’ వెబ్‌ సిరీస్‌లో అసభ్యకరమైన భాష ఉందని, అటువంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో ఓటీటీ కంటెంట్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని