Wrestlers Protest: కేంద్రమంత్రి అర్ధరాత్రి ట్వీట్.. అనురాగ్ ఠాకూర్ ఇంటికి రెజ్లర్లు
Wrestlers Protest: రెజ్లర్ల సమస్యలు వినేందుకు వారిని కేంద్రం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్(BJP MP Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు గతకొద్దికాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారు విధుల్లో చేరినా.. ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) ట్విటర్ వేదికగా స్పందించారు. ‘రెజ్లర్ల సమస్యలపై వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయమై వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించాను’ అని ఠాకూర్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి ఆహ్వానాన్ని రెజ్లర్లు అంగీకరించారు. ఈ ఉదయం బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా పలువురు రెజ్లర్లు చర్చల నిమిత్తం అనురాగ్ ఠాకూర్ ఇంటికి వెళ్లారు. కాగా.. ఈ చర్చల్లో రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. (Wrestlers Protest)
శనివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah).. రెజ్లర్లతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నుంచి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు. న్యాయం కోసం జరిగే పోరాటంలో వెనక్కి తగ్గలేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అనురాగ్ ఠాగూర్ నుంచి ట్వీట్ వచ్చింది.
అమిత్ షాతో భేటీపై బజరంగ్ పునియా స్పందిస్తూ.. తాము కేంద్రమంత్రితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తెలిపారు. ‘ఈ ఉద్యమం ఆగదు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వ్యూహరచన చేస్తున్నాం. ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించలేదు. ప్రభుత్వ స్పందనతో మేం సంతృప్తిగా లేము’అని పునియా వెల్లడించారు. మే 31నే వారు విధుల్లో చేరినట్లు ఇది వరకు రైల్వే అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.