Lakhimpur Kheri: లఖింపుర్‌ ఘటన.. ఆశిష్‌ మిశ్రా నేపాల్‌ పారిపోయాడా?

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు ప్రధాన బాధ్యుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌

Updated : 08 Oct 2021 18:47 IST

 రెండోసారి సమన్లు జారీ చేసిన పోలీసులు

లఖింపుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు ప్రధాన బాధ్యుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా దేశం విడిచి పారిపోయాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తునకు శుక్రవారం హాజరుకావాలని ఆదేశించినప్పటికీ అతడు రాలేదు. దీంతో పోలీసులు నేడు మరోసారి సమన్లు జారీ చేశారు. 

లఖింపుర్‌ ఘటనలో ఆశిష్‌ సహా పలువురిపై హత్యా నేరం కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కేసు విచారణకు హాజరుకావాలని పోలీసులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పోలీస్‌ లైన్స్‌లోని కార్యాలయానికి రావాలని ఆదేశించారు. అయితే ఒంటి గంట వరకూ ఎదురు చూసినప్పటికీ ఆశిష్‌ రాలేదు. దీంతో ఈ మధ్యాహ్నం పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు పోలీస్‌ లైన్స్‌ కార్యాలయానికి రావాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అజయ్‌ మిశ్రా నివాసానికి నోటీసులు అంటించారు. 

ఇదిలా ఉండగా.. ఘటన జరిగిన తర్వాత నుంచి ఆశిష్‌ పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరక్కుండా పలు ప్రాంతాలకు వెళ్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అతడి కోసం యూపీ పోలీసులు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆశిష్‌ శుక్రవారం భారత్‌-నేపాల్ సరిహద్దుల్లో సంచరించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అతడు నేపాల్‌ పారిపోయి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

నా కొడుకు అమాయకుడు: అజయ్‌ మిశ్రా

లఖింపుర్‌ ఖేరి ఘటనలో హింసకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడు ఆశిష్‌ మిశ్రా అమాయకుడని ఆయన తండ్రి, కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా అన్నారు. దిల్లీ నుంచి లఖ్‌నవూ చేరుకున్న అజయ్‌.. విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడారు. పోలీసులు నిన్ననే సమన్లు జారీ చేసినప్పటికీ అనారోగ్య కారణాల రీత్యా శుక్రవారం హాజరుకాలేకపోయాడన్నారు. శనివారం మాత్రం పోలీసుల ఎదుట హాజరవుతాడని తెలిపారు. ఇది భాజపా ప్రభుత్వమని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఈ ఘటనలో దోషులకు శిక్షపడుతుందని వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని