నేనున్నాననీ.. నీకేం కాదని

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ కట్టడి, టీకాల గురించి ఆలోచిస్తుంటే జపాన్‌ మాత్రం ఆ మహమ్మారి కారణంగా తీవ్రమైన మరో

Published : 28 Feb 2021 13:14 IST

ఒంటరితనం నివారణకు జపాన్‌లో మంత్రిత్వశాఖ

టోక్యో: ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ కట్టడి, టీకాల గురించి ఆలోచిస్తుంటే జపాన్‌ మాత్రం ఆ మహమ్మారి కారణంగా తీవ్రమైన మరో సమస్య గురించి గాబరా పడుతోంది. దీని నివారణ కోసం ఏకంగా ఓ మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేసింది! అదే ‘ఒంటరితనం’ మంత్రిత్వ శాఖ! తెత్సుషి సకామోటో ఆ కొత్త శాఖకు మంత్రి! ఇలా హడావుడిగా ఒంటరితనం కోసం మంత్రిత్వ శాఖను, దానికో మంత్రిని ఏర్పాటు చేయడానికి కారణం.. జపాన్‌లో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోవడం!

2020లో 21వేల ఆత్మహత్యలు..
గత దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా జపాన్‌లో కొన్ని నెలలుగా ఆత్మహత్యలు పెరిగిపోయాయి. 2020లో దాదాపు 21వేల మందికిపైగా ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో పెరిగిపోతున్న ఒంటరితనం సంస్కృతి సహా ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

కుడోకుషి..
జపాన్‌ దేశ జనాభాలో 65 ఏళ్లు దాటినవారు 20శాతానికిపైగా ఉన్నట్లు అంచనా. ఈ విభాగంలో ఇంతమంది జనాభాగల దేశం జపానే! వీరిలో చాలామంది ఒంటరిగానే జీవిస్తుంటారు. వయసు కారణంగా చాలామందితో కలిసి ఉండలేక పోవడం ఒకెత్తైతే, ఎవరూ లేరనే భావనతో మరికొంతమంది కుంగిపోతుంటారు. వీరిలో చాలామంది ఇళ్లలో ఒంటరిగా ఉంటారు. వారు చనిపోయిన విషయం కూడా కొద్దిరోజుల వరకు తెలియని దుస్థితి. దీన్ని జపాన్‌ భాషలో ‘కుడోకుషి’ (ఒంటరి మరణం) అని పిలుస్తారు. 

హికికొమోరి...
జపాన్‌లో ఒంటరితనం ఓ సంస్కృతిగా విస్తరిస్తోంది. ఒంటరితనానికి, ఏకాంతానికి మధ్య గీతను చెరిపేసి, రెండూ ఒకటే అన్నట్లుగా జీవిస్తున్నవారి సంఖ్య బోలెడంత! దాదాపు 10 లక్షల మంది బయటి ప్రపంచానికి పూర్తిగా దూరంగా, ఎవరితో కలవకుండా, గదిలో నుంచి బయటకు రాకుండా ఒంటరిగా బతుకుతున్నారు. వీరిని జపాన్‌ పరిభాషలో ‘హికికొమోరి’ అంటారు. నిరుద్యోగం, సరైన చదువు అబ్బకపోవడం, ఇతరత్రా సామాజిక కారణాలు హికికొమోరి సంస్కృతిని పెంచుతున్నాయి. దీనికి తోడు ఈ సంస్కృతిని జపాన్‌ ప్రత్యేకతగా గొప్పగా భావించి, ప్రాచుర్యం కల్పించేవారి సంఖ్యా పెరుగుతోంది. ఇలా ఈ సంస్కృతిలో పడేవారిని గుర్తించి, ఒంటరితనం నుంచి బయటకు తీసుకువచ్చి, మానసిక వైద్యం అందించడం ఇంకా కష్టమవుతోంది.

కరోషి
ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎక్కువ పనిగంటలు జపాన్‌లో ఉన్నాయి. దీంతో ఆ దేశ కార్మికులు, ఉద్యోగులు.. స్నేహితులతో, బంధువులతో, కుటుంబంతో సరైన రీతిలో గడపడానికి వీలుచిక్కని పరిస్థితి. జపాన్‌ కార్మిక నిబంధనల ప్రకారం రోజుకు 8 గంటలు, వారానికి 40 గంటలు పనిచేయాలి. 2016లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం చాలా కంపెనీలు నెలలో చేయాల్సిన దానికంటే 80 గంటలు అదనంగా పనిచేయించుకుని డబ్బులు కూడా చెల్లించడం లేదని తేలింది. ఇలా మితిమీరిన పనిభారంతో కూడా చాలామంది చనిపోతున్నారు. దీన్ని జపాన్‌ భాషలో ‘కరోషి’ అంటుంటారు. జీవితంలో ఉల్లాసాలకు దూరమై చాలామంది పనిభారంతో కుంగిపోతున్నారు. ఎత్తైన భవనాల నుంచి దూకి చనిపోవడం చాలా సర్వసాధారణం అక్కడ! అందుకే చాలా చోట్ల ఫుట్‌పాత్‌లపై నడుస్తూ వెళుతుంటే ‘మైండ్‌ ది స్కై’ (కాస్త పైకి చూస్తూ నడవండి. ఎవరైనా పై నుంచి దూకుతున్నారేమో జాగ్రత్త) అని అర్థం వచ్చేలా బోర్డులు ఏర్పాటుచేస్తున్నారు.

పులిమీద పుట్రలా..
జపాన్‌ సమాజంలో పెరిగిపోతున్న ఈ హికికొమోరికి కరోనా మహమ్మారి తోడవడంతో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోయింది. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో మహిళలే ఎక్కువ ఉండడం గమనార్హం. గత సంవత్సరంతో పోలిస్తే మహిళల ఆత్మహత్యలు ఈ సారి 15శాతం మేర పెరిగాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ సమస్యలన్నింటినీ గుర్తించి.. వాటికి పరిష్కారాలను కనుగొనేందుకు జపాన్‌ ప్రధానమంత్రి ఒంటరితనం మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు. ఆత్మహత్యలను అరికట్టే ప్రణాళిక రూపొందించే బాధ్యత ఆ శాఖ మంత్రి తెత్సుషి సకామోటోకు అప్పగించారు.- ఈనాడు ప్రత్యేక విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని