Weather: ఉత్తరాది గజగజ. -4 డిగ్రీల కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు?

ఉత్తరభారత దేశంలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.  జనవరి 14 నుంచి 19 మధ్య కాలంలో -4 డిగ్రీలకుఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Published : 12 Jan 2023 20:10 IST

దిల్లీ: ఉత్తర భారతాన్ని చలి (Cold) వణికిస్తోంది. గత కొన్ని వారాలుగా ఉష్ణోగ్రతలు (Temparature) రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి.  రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల -4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఆన్‌లైన్‌ వాతావరణ వేదిక ‘లైవ్‌ వెదర్‌ ఆఫ్‌ ఇండియా’ (Live Weather of India) వ్యవస్థాపకులు నవ్‌దీప్‌ దహియా వెల్లడించారు. జనవరి 14 నుంచి 19 తేదీల మధ్య చలిగాలులు తీవ్రంగా వీచే అవకాశముందని, ఫలితంగా ఉష్ణోగ్రతలు తక్కువస్థాయికి చేరుకుంటాయని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. జనవరి 16, 18 తేదీల మధ్య చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు.

రానున్న మూడు రోజుల్లో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని దహియా చెబుతున్నారు. పొగమంచు తీవ్రత  పెరుగుతుందని, ‘కోల్డ్‌ బ్లాస్ట్‌’ లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఉత్తరభారతంలో 21వ శతాబ్దంలో ఇప్పటి వరకు నమోదు కాని కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు.  మరోవైపు జనవరి 12 తర్వాత దేశ రాజధాని దిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నామమాత్రంగా పెరిగే అవకాశముందని, అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గతంలో వెల్లడించింది. అయితే వాయవ్య ప్రాంతం నుంచి వీస్తున్న చలిగాలుల వల్ల శనివారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని పేర్కొంది. 

దిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో జనవరి 3 నుంచి 9 మధ్య కాలంలో ఐదు రోజుల పాటు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్దిష్ట కాలంలో (Cold Spell) గత 23 ఏళ్లలో ఇంతటి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది మూడోసారి. గతంలో 2006 సంవత్సరంలో ఏర్పడిన కోల్డ్‌ స్పెల్‌లో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. 2013లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురైనట్లు ఐఎండీ వెల్లడించింది. కానీ, తాజా పరిస్థితులను అంచనా వేసిన వాతావారణ నిపుణులు జనవరి 14 నుంచి జనవరి 19 తేదీల మధ్య ఉత్తరభారతంలో కొన్ని చోట్ల -4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని