Mixing Doses: వేర్వేరు డోసులతో మరింత ఇమ్యూనిటీ!

ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లకు చెందిన రెండు వేర్వేరు డోసులను తీసుకున్న వారిలో రోగనిరోధకత ప్రతిస్పందనలు మరింత ఎక్కువగా ఉంటున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో తేలింది.

Published : 29 Jun 2021 19:00 IST

లాన్సెట్‌ నివేదికలో వెల్లడి

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా ఒకే రకమైన కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతున్నప్పటికీ.. మిశ్రమ వ్యాక్సిన్‌లు ఇచ్చే విధానంపైనా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లకు చెందిన రెండు వేర్వేరు డోసులను తీసుకున్న వారిలో రోగనిరోధకత ప్రతిస్పందనలు మరింత ఎక్కువగా ఉంటున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన తాజా నివేదిక అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌లో ప్రచురితమయ్యింది. పలు దేశాలు వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్న వేళ.. తాజా ఫలితాలు ఊరట కలిగిస్తున్నాయి.

తొలి డోసులో ఒక వ్యాక్సిన్‌, రెండో డోసులో మరో వ్యాక్సిన్‌ తీసుకునే విధానంపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ వ్యాక్సిన్‌ డోసులను (Mixing Doses) నాలుగు వారాల వ్యవధిలో ఇచ్చి పరీక్షించారు. అనంతరం వారిలో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు భారీస్థాయిలో ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తొలిడోసు ఫైజర్‌ తీసుకున్న తర్వాత రెండో డోసులో ఆస్ట్రాజెనెకా తీసుకున్నట్లయితే యాంటీబాడీలతో పాటు, టీ-కణాల వృద్ధి గణనీయంగా పెరుగుతున్నట్లు కనుగొన్నారు.

ఒకే రకమైన డోసుల కంటే ఎక్కువగా..

రెండు డోసుల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికంటే వేర్వేరు డోసులు తీసుకున్న వారిలోనే యాంటీబాడీలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఫైజర్‌ రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే.. ఫైజర్‌ తొలిడోసు, ఆస్ట్రాజెనెకా రెండో డోసు తీసుకున్న వారిలో టీ-కణాల ప్రతిస్పందనలు మరింత మెరుగుగా ఉన్నాయని కనుగొన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి రెండు వేర్వేరు డోసులు తీసుకునేందుకు తాజా ఫలితాలు దోహదం చేస్తాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మ్యాథ్యూ స్నేప్‌ మీడియాతో పేర్కొన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్‌ డోసుల మధ్య వ్యవధిని పెంచడంపై అధ్యయనాలు వచ్చాయని.. తొలి డోసు తీసుకున్న 10నెలల తర్వాత కూడా రోగనిరోధకత ప్రతిస్పందనలు ఎక్కువగానే ఉన్నట్లు తాజా ఫలితాల్లో తేలిందని చెప్పారు. ఇక మిక్స్‌డ్‌ డోసుల మధ్య 12వారాల గడువుపైనా అధ్యయనాలు జరుగుతున్నాయని.. వాటి ఫలితాలు వచ్చే నెలలో తెలిసే అవకాశం ఉందని మ్యాథ్యూ స్నేప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

మిక్స్‌డ్‌ డోసుల ప్రయోగాలను 50ఏళ్ల వయసుపైబడిన 830మంది వాలంటీర్లపై చేపట్టారు. వుహాన్‌లో తొలుత వెలుగు చూసిన కరోనా వేరియంట్‌పై పనితీరును ఈ అధ్యయనంలో అంచనా వేశారు. అయితే, కొత్తగా వెలుగుచూస్తోన్న కరోనా రకాలపై ఈ విధానం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు బూస్టర్‌ డోసుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ అధ్యయనాన్ని కొనసాగిస్తామని మ్యాథ్యూ స్నేప్‌ పేర్కొన్నారు. ఇక మోడెర్నా, నొవావాక్స్‌ టీకాల డోసుల మిక్సింగ్‌పైనా  తదుపరి దృష్టి సారిస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని