Vaccine: వేర్వేరు టీకా డోసులు ఇప్పుడే కాదు 

టీకా విధానంలో వేర్వేరు డోసుల సమర్థత ఇంకా శాస్త్రీయంగా రుజువు కానందున ప్రస్తుతానికి వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ అనే ప్రశ్నే లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అంతేగాక, కొవిషీల్డ్‌ కూడా సింగిల్‌ డోసు కాదని, రెండు డోసులు వేయించుకోవాల్సిందేనని వెల్లడించింది.

Updated : 01 Jun 2021 18:35 IST

స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ 

దిల్లీ: టీకా విధానంలో వేర్వేరు డోసుల సమర్థత ఇంకా శాస్త్రీయంగా రుజువు కానందున ప్రస్తుతానికి వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ అనే ప్రశ్నే లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అంతేగాక, కొవిషీల్డ్‌ కూడా సింగిల్‌ డోసు కాదని, రెండు డోసులు వేయించుకోవాల్సిందేనని వెల్లడించింది. ‘‘కొవిషీల్డ్‌ రెండు డోసుల టీకా. ఇందులో ఎలాంటి మార్పు లేదు. డోసుల వ్యవధిలోనూ మార్పు ఉండదు. తొలి డోసు వేసుకున్న 12 వారాల తర్వాతే కొవిషీల్డ్‌ రెండో డోసు తీసుకోవాలి. ఇక వ్యాక్సిన్‌ వేర్వేరు డోసుల మిక్సింగ్‌ విషయానికొస్తే.. శాస్త్రీయంగా నిరూపణ అయ్యేంతవరకు దీన్ని అనుసరించకూడదు. ప్రస్తుతానికి తొలి డోసులో వేయించుకున్న వ్యాక్సిన్‌నే రెండో డోసులో కూడా తీసుకోవాలి’’ అని ఆరోగ్యశాఖ వివరించింది. వేర్వేరే టీకా డోసులు, కేవలం సింగిల్‌ డోసు టీకాలంటూ గత కొద్ది రోజులుగా మీడియా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. 

జులై నాటికి రోజుకు కోటిమందికి టీకా

ఇక ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. జులై మధ్య నాటికి లేదా ఆగస్టుకు రోజుకు కోటి మందికి టీకాలు ఇచ్చేలా వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 21.6 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. ఇందులో 1.67 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 2.42 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ఉన్నారు. 45ఏళ్లు పైబడినవారు 15.48కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. 18-44 ఏళ్ల వారిలో 2.03 కోట్ల మందికి టీకా ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. 

6.62 శాతానికి పాజిటివిటీ రేటు..

మే తొలి వారంతో పోలిస్తే రోజువారీ కేసులు 69శాతం తగ్గినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 6.62శాతానికి పడిపోయిందని, ఏప్రిల్‌ 1 తర్వాత అది ఇంత కనిష్ఠంగా ఉండటం మళ్లీ ఇప్పుడేనని వెల్లడించింది. 

30 రాష్ట్రాల్లో తగ్గుతున్న యాక్టివ్‌ కేసులు

‘దేశంలో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గాయి. యాక్టివ్‌ కేసుల్లో రోజుకు 1.3లక్షల తగ్గుదల కనిపిస్తోంది. గత వారం రోజులుగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసులు కూడా నానాటికీ దిగొస్తున్నాయి. మే 28 నుంచి రోజువారీ కేసులు 2లక్షలకు దిగువనే ఉంటున్నాయి. మే 7న నమోదైన అత్యధిక రోజువారీ కేసులతో పోలిస్తే ఇప్పుడు దాదాపు 69శాతం తగ్గాయి’ అని ఆరోగ్యశాఖ వెల్లడించింది. 344 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువే ఉందని పేర్కొంది. రికవరీలు కూడా నానాటికీ పెరుగుతున్నాయని, ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 92శాతానికి చేరినట్లు తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని