Mizoram: వైద్యుడిపై కుమార్తె దురుసు ప్రవర్తన.. సారీ చెప్పిన ముఖ్యమంత్రి!

తన కూతురు దురుసు ప్రవర్తన పట్ల మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా (Zoramthanga) బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది......

Published : 22 Aug 2022 02:08 IST

గువాహటి: తన కుమార్తె దురుసు ప్రవర్తన పట్ల మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా (Zoramthanga) స్పందించారు. ఓ వైద్యుడిపై ఆమె దాడి చేసిన ఘటనపై విమర్శలు రావడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో సీఎం కుమార్తె మిలారీ చాంగ్టే ఇటీవల ఓ క్లీనిక్‌కు వెళ్లారు. అయితే, అపాయింట్‌మెంట్‌ లేకుండా తాను చూడనని, క్లీనిక్‌ వచ్చేముందు అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సిందేనని డెర్మటాలజీ విభాగం వైద్యుడు తేల్చి చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన చాంగ్టే క్లినిక్‌లో అందరూ చూస్తుండగానే వైద్యుడి వద్దకు వెళ్లి అతడి ముఖంపై దాడి చేసింది. అయితే, అక్కడే ఉన్న కొందరు ఆమెను అడ్డుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గత రెండు రోజులుగా ఈ అంశంపై ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాకుండా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) మిజోరం శాఖ ఆధ్వర్యంలో నిరసనలు మొదలయ్యాయి. నిన్న వైద్య సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దీంతో చివరికి ముఖ్యమంత్రి జోరంతంగా తన కూతురు చేసిన పనికి బహిరంగ క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఐజ్వాల్‌కు చెందిన డెర్మటాలజిస్ట్‌తో తన కుమార్తె తప్పుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నానని.. ఆమె ప్రవర్తన ఏ విధంగానూ సమర్థనీయం కాదని పేర్కొంటూ తన చేతి రాతతో ఉన్న నోట్‌ను షేర్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని