Published : 28 Mar 2022 13:26 IST

Birbhum Killings: బెంగాల్‌ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ శాసనసభలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బీర్‌భూం సజీవదహనాల ఘటనపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది కాస్తా తీవ్ర రూపం దాల్చి ఎమ్మెల్యేలు పరస్పరం దాడులకు దిగారు. ఇరు పక్షాల ఎమ్మెల్యేలు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు.

ఇటీవల బీర్‌భూం జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన భాజపా.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేసింది. అయితే భాజపా నేతల వ్యాఖ్యలను తృణమూల్‌ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 

భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి లేచి గొడవకు దిగారు. ఇది కాస్తా ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యేలు పరస్పరం తోసుకోవడం, దాడి చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఘటన అనంతరం భాజపా ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ‘‘అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయింది. మా సభ్యులపై టీఎంసీ ఎమ్మెల్యేలు దాడి చేశారు’’ అని భాజపా శాసనసభా పక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను తృణమూల్‌ మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ కొట్టిపారేశారు. అసెంబ్లీలో గందరగోళం సృష్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు ఘటన నేపథ్యంలో ఐదుగురు భాజపా సభ్యులను స్పీకర్‌ సభ నుంచి సస్పెండ్‌ చేశారు. సువేందు అధికారి, మనోజ్‌ టిగ్గా, నరహరి మహతో, శంకర్‌ ఘోష్‌, దీపర్‌ బర్మాన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

మార్చి 21న  బీర్‌భూం జిల్లాలో బర్షాల్‌ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత భాదు షేక్‌ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే రామ్‌పుర్‌హాట్‌ పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై 8 మంది సజీవ దహనమయ్యారు. భాదు షేక్‌ హత్యతో ప్రత్యర్థు ఇళ్లకు టీఎంసీ కార్యకర్తలు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హత్యకు ముందు వారిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కలకత్తా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే తృణమూల్‌ నేత సహా 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని