MLC Kavitha: ఈరోజు విచారణకు హాజరు కాలేను.. ఈడీకి కవిత లేఖ

దిల్లీ మద్యం కేసులో ఈరోజు విచారణకు హాజరు కాలేనని భారాస ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం పంపారు. అయితే, అధికారులు ఆమెను విచారించేందుకు మరో తేదీని కేటాయిస్తారా? లేదంటే తప్పనిసరిగా రావాల్సిందే అంటారా? అనే అంశం ఉత్కంఠగా మారింది.

Updated : 16 Mar 2023 16:10 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఈరోజు విచారణకు హాజరు కాలేనని భారాస ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED)కు లేఖ రాశారు. మరికాసేపట్లో దిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె తన లేఖను అధికారులకు ఈ- మెయిల్‌లో పంపారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు ఉన్న కారణంగా ఈడీ విచారణకు రాలేకపోతున్నట్టు ఆమె పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 11న జరిగిన విచారణలో ఈడీ అధికారులు అడిగిన పత్రాలను తన న్యాయవాది భరత్‌ ద్వారా కవిత పంపారు. అయితే, ఆమె విజ్ఞప్తి నేపథ్యంలో ఈడీ అధికారులు కవితకు మరో తేదీ ఇస్తారా? రావాల్సిందేనని చెబుతారా అనే అంశం ఉత్కంఠగా మారింది.

వ్యక్తిగతంగా హాజరవ్వాలని సమన్లలో పేర్కొనలేదు..

‘మహిళలను కార్యాలయానికి పిలిచి విచారించొద్దు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధమే. అధికారులు నా  నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చు. ఈ నెల 11న జరిగిన విచారణకు పూర్తిగా సహకరించా. ఈడీ ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలు చెప్పాను. ఈ నెల 11న రాత్రి 8గంటల వరకు విచారించారు. ఇవాళ మళ్లీ రావాలని 11వ తేదీన సమన్లు ఇచ్చారు. వ్యక్తిగతంగా రావాలని సమన్లలో పేర్కొనలేదు. నా ప్రతినిధిగా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నా. మీరు అడిగిన వివరాలు భరత్‌ ద్వారా పంపాను. నా హక్కుల రక్షణ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాను. ఈ నెల 24న నా పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది’’  అని కవిత తన లేఖలో పేర్కొన్నారు. 

ఈ నెల 11న దాదాపు ఎనిమిది గంటల పాటు కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. 16న మరోసారి విచారణకు రావాలని అదే రోజు సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, మళ్లీ హాజరుకావాలంటూ జారీ చేసిన సమన్లను సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆమె దాఖలు చేసిన వ్యాజ్యంపై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈనెల 24న విచారణ చేపడతామని సీజేఐ స్పష్టం చేశారు. ఈ నెల 16న హాజరు కావడంపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సైతం కోర్టు నిరాకరించిన నేపథ్యంలో కవిత ఈరోజు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో సమావేశం అనంతరం ఈడీకి ఈమెయిల్ పంపినట్టు సమాచారం. కవిత ఈడీ విచారణ దృష్ట్యా మంత్రులు కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌ ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు. 

కవితను ఈడీ వేధిస్తోంది.. లాయర్‌ భరత్‌

ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారులు అన్యాయంగా కేసులుపెట్టి వేధిస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది భరత్‌ అన్నారు. అనారోగ్యం అని అసత్యప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహిళను ఇంటి వద్దే విచారించాలని తెలిపారు. విచారణకు మళ్లీ ఎప్పుడు రావాలో ఈడీ చెప్పలేదన్నారు. కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్‌ ఈ నెల 24న విచారణకు రానుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తదుపరి ఆదేశాల ప్రకారమే తాము ముందుకెళ్తామని స్పష్టంచేశారు.

హైదరాబాద్‌ ఈడీ ఆఫీస్‌ వద్ద భారీ భద్రత

దిల్లీలో ఈడీ కార్యాలయంలో కవిత విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈడీ ఆఫీస్‌ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కవితకు మరోసారి ఈడీ నోటీసులకు నిరసనగా భారాస కార్యకర్తలు ముట్టడిస్తారేమోనని ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ఈడీ కార్యాలయం ద్వారాన్ని మూసివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని