Manipur: మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్తతలు.. కర్ఫ్యూ సడలింపులు రద్దు!

మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ వారిని విడుదల చేయాలంటూ ఆందోళనకారులు పోలీస్‌ స్టేషన్‌ల ముట్టడికి యత్నించగా.. పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

Published : 21 Sep 2023 20:57 IST

ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిపోతున్న మణిపుర్‌ (Manipur)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన అయిదుగురు యువకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. పెద్దఎత్తున స్థానికులు పోలీస్‌స్టేషన్‌ల ముట్టడికి యత్నించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌లు ప్రయోగించారు. ఈ క్రమంలో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితులు మరింత దిగజారకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపులను రద్దు చేశారు.

అధునాతన ఆయుధాలు, భద్రతా బలగాల యూనిఫాంలతో తిరుగుతున్న అయిదుగురు యువకులను సెప్టెంబరు 16న మణిపుర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారిని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, పోలీసు కస్టడీకి తరలించారు. ఆ అరెస్టుతో స్థానికంగా నిరసనలు మొదలయ్యాయి. నిందితులను విడిచిపెట్టాలంటూ.. మంగళవారం నుంచి 48 గంటల లాక్‌డౌన్‌ పాటించారు. ఈ క్రమంలోనే ఆయా సంఘాల పిలుపుతో గురువారం మహిళలు సహా వందలాది మంది నిరసనకారులు తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాల్లోని ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో ప్రవేశించేందుకు యత్నించారు.

కుకీ-మైతేయ్‌ విద్వేషం వెనుక..!

ఈ క్రమంలోనే నిరసనకారులను చెదరగొట్టేందుకు.. పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో 10 మందికిపైగా గాయాలయ్యాయి. తమ అయిదుగురు వాలంటీర్లను విడుదల చేయడంలో పోలీసులు విఫలమయ్యారని, ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా అరెస్టు కావడం మినహా తమకు వేరే దారిలేకపోయిందని నిరసనకారులు ఓ వార్తాసంస్థతో పేర్కొన్నారు. అటువంటి వారిని అరెస్టు చేస్తే.. మైతేయ్‌ గ్రామాలను ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. మరోవైపు.. స్థానికంగా ఉద్రిక్త పరిణామాలతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఇంఫాల్‌ జంట జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపులను రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని