Modi: మీ అనుభవాలను అందరికీ పంచండి.. మీరు మళ్లీ రావాలని కోరుకుంటున్నా!

‘మీ అనుభవాలను దేశం నలుమూలకు తీసుకెళ్లండి. కొన్నిసార్లు చదువు కంటే అనుభవానికే ఎక్కువ శక్తి ఉంటుంది’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పెద్దల సభ నుంచి విరమణ పొందుతోన్న 72 మంది ఎంపీలను ఉద్దేశించి గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated : 31 Mar 2022 15:10 IST

త్వరలో పదవీ విరమణ పొందనున్న 72 మంది రాజ్యసభ సభ్యులు

దిల్లీ: ‘మీ అనుభవాలను దేశం నలుమూలకు తీసుకెళ్లండి. కొన్నిసార్లు చదువు కంటే అనుభవానికే ఎక్కువ శక్తి ఉంటుంది’ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజ్యసభ సభ నుంచి విరమణ పొందుతోన్న 72 మంది ఎంపీలను ఉద్దేశించి గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘మన రాజ్యసభ సభ్యులకు అపారమైన అనుభవం ఉంది. మనం ఈ పార్లమెంట్‌లోనే ఎక్కువ సమయం గడుపుతాం. ఈ సభ మన ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడింది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఎందరో మహానుభావులు తమ విజ్ఞానాన్ని మనకు పంచిపెట్టారు. ఇప్పుడు అది మన బాధ్యత. ఒక సభ్యుడిగా పొందిన అనుభవాన్ని.. దేశం నలుదిశలా వ్యాప్తి చేయండి’ అని సూచించారు. పదవీ కాలం ముగిసి వెళ్లిపోతున్న సభ్యులు మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తర్వాత వారితో కలిసి ఫొటోలు దిగారు.

వెళ్లేది వీరే..

రాజ్యసభ శాశ్వత సభ. లోక్‌సభలా ఇది రద్దు కాదు. అయితే సభలో ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సభ్యులు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి బయటకు వెళ్తుంటారు. ప్రస్తుతం జులై వరకు ఈ విరమణలు కొనసాగనున్నాయి. ఏప్రిల్‌లో ఆనంద్‌ శర్మ, ఏకే ఆంటోనీ, సుబ్రహ్మణ్య స్వామి, మేరీకోమ్, స్వపన్ దాస్ గుప్తా వెళ్లిపోనున్నారు. జూన్‌లో నిర్మలా సీతారామన్, సురేశ్ ప్రభు, ఎంజే అక్బర్, జైరామ్ రమేశ్, వివేక్ టంకా, విజయ్ సాయి రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఇక జులైలో పియూశ్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పి చిదంబరం, అంబికా సోని, కపిల్ సిబల్, సంజయ్ రౌత్, ప్రఫుల్ పటేల్ తదితర నేతలు విమరణ చేస్తున్నారు. అయితే వీరిలో కొందరు తిరిగి నామినేట్ అయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని