Ukraine crisis: విద్యార్థుల తరలింపునకు స్వయంగా వెళ్లనున్న కేంద్ర మంత్రులు..!

రష్యా దాడితో ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పలువురు భారతీయ పౌరులు, విద్యార్థులు చిక్కుకుపోయారు.

Published : 28 Feb 2022 12:19 IST

ఉక్రెయిన్‌ సంక్షోభంపై మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం

దిల్లీ: రష్యా దాడితో ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పలువురు భారతీయ పౌరులు, విద్యార్థులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల తరలింపును సమన్వయం చేసేందుకు కొందరు కేంద్రమంత్రులు ఉక్రెయిన్‌ పొరుగుదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ మంత్రులు జాబితాలో హర్దీప్‌ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్‌ రిజుజు, వీకే సింగ్ ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

కేంద్రం ఆపరేషన్ గంగ పేరిట ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల్ని భారత్‌కు తీసుకువస్తోంది. ఇప్పటివరకు 2 వేల మంది విద్యార్థుల్ని తరలించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. దాదాపు 16 వేల మంది విద్యార్థులు ఆ దేశంలో ఉండగా.. వారంతా బంకర్లు, బాంబ్‌ షెల్టర్లు, హాస్టళ్ల బేస్‌మెంట్ల కింద తలదాచుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ తరలింపు ప్రక్రియ నిదానంగా సాగుతోందని విపక్షాలు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వస్తోన్న వీడియోలను షేర్ చేస్తూ..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రష్యా చేపట్టిన సైనిక పోరు కారణంగా ఉక్రెయిన్ గగనతలం మూసివేసింది. దాంతో అక్కడి విద్యార్థులు ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం వైపున ఉన్న సరిహద్దు దేశాలకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి విమానాల్లో భారత్‌కు పయనమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని