కన్నీటి పర్యంతమైన మోదీ

‘కరోనా మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎంతో మంది తల్లుల కడుపుకోతకు కారణమైంది’ అని టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రపంచంలోనే

Updated : 16 Jan 2021 15:47 IST

దిల్లీ: ‘కరోనా మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎంతో మంది తల్లుల కడుపుకోతకు కారణమైంది’ అని టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ప్రక్రియను మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా పోరులో గతేడాది ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

‘దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు లక్షల మంది వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు నిర్విరామంగా పనిచేశారు. ఈ క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విధుల కోసమని వెళ్లిన సిబ్బందిలో కొంతమంది ఇంటికి తిరిగి రాలేదు’ అని చెబుతూ ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వ్యాధి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని, కరోనా కారణంగా ఎంతోమంది తల్లులు తమ పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ఆసుపత్రుల్లో చేరిన వృద్ధులను వారి కుటుంబసభ్యులు కలుసుకోలేకపోయారని తెలిపారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారికి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు.

కష్టమైనా లాక్‌డౌన్‌ తప్పలేదు..

‘దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం అంత సాధ్యమైన పనికాదు. కానీ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ప్రజల సహకారం వల్లే కరోనా వ్యాప్తిని అరికట్టగలిగాం. మహమ్మారిని ఎదుర్కొనే సమయంలో ప్రజలంతా కలిసికట్టుగా ఉన్నారు’ అని మోదీ కొనియాడారు. 

దవాయి భీ.. కదయి భీ..

వ్యాక్సిన్లు వచ్చినా జాగ్రత్తలు మరవొద్దని ప్రధాని మోదీ సూచించారు. టీకా తీసుకున్నా మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించాలన్నారు. ‘ఈ సమయంలో మన కొత్త మంత్రం ఇదే.. దవాయి భీ.. కదయి భీ(మందులతో పాటు జాగ్రత్తలు కూడా)’ అని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రపంచానికి ఉదాహరణగా భారత్‌..

కరోనా పోరులో ఎన్నో విషయాల్లో భారత్‌ ప్రపంచానికి ఉదాహరణగా మారిందని మోదీ అన్నారు. ‘చైనాలో వైరస్‌ విజృంభించిన తర్వాత అక్కడ చిక్కుకుపోయిన తమ పౌరులను తీసుకొచ్చేందుకు అనేక దేశాలు ఇబ్బందిపడ్డాయి. వారిని స్వదేశాలకు తీసుకురాలేకపోయాయి. కానీ భారత్‌ ముందుకొచ్చింది. వందే భారత్‌ మిషన్‌ ద్వారా చైనాలో చిక్కుకుపోయిన భారతీయులనే గాక, ఇతర దేశాల ప్రజలను కూడా అక్కడి నుంచి బయటకు తీసుకురాలగలిగింది’ అని మోదీ తెలిపారు. 

చౌక ధరకే దేశీయ టీకాలు..

‘శాస్త్రవేత్తల కృషితో దేశంలో రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. విదేశీ టీకాలతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే ఈ టీకాలు లభిస్తున్నాయి. అంతేగాక, సాధారణ ఉష్ణోగ్రతల్లోనూ వీటిని భద్రపరిచే వీలుంది’ అని మోదీ చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్‌పై వదంతులు నమ్మొద్దని దేశ ప్రజలను కోరారు.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ఫొటో గ్యాలరీ

 

ఇవీ చదవండి..

అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం

‘పేషెంట్‌ జీరో’ను ఎప్పటికీ కనుక్కోలేము..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని