Mahua Moitra: షెల్‌ కంపెనీకి నిర్వచనమే లేదట.. ఇక అదానీపై చర్యలెలా..?

డొల్ల కంపెనీలకు (Shell Companies) సంబంధించిన నిర్వచనం ఆర్థిక శాఖ వద్ద లేనప్పుడు అదానీకి సంబంధించి వచ్చే ఆరోపణలపై ప్రభుత్వం చర్యలెలా తీసుకుంటుందని తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Published : 28 Mar 2023 01:34 IST

దిల్లీ: గౌతమ్‌ అదానీ( Gautam Adani), ఆయన సంస్థలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) విమర్శించారు. షెల్‌ కంపెనీ(డొల్ల సంస్థలు)లు అంటే ఏంటో తమకు తెలియదని ప్రభుత్వం ఇచ్చిన సమాధానమే ఇందుకు నిదర్శనమన్నారు. వీటికి సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ (Finance Ministry) ఇటీవల ఇచ్చిన సమాధానాన్ని ఉదహరిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

‘అదానీపై ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుంది..? షెల్‌ కంపెనీల (Shell Companies) అర్థం ఏంటో ఆర్థిక శాఖకు తెలియదు. రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోనూ వీటిపై ఎటువంటి సమాచారం లేదని పేర్కొంది. దీంతో చర్యలు కూడా శూన్యం’ అంటూ ఎంపీ మొయిత్రా విచారం వ్యక్తం చేశారు. స్పష్టమైన నిర్వచనం లేకుండానే గతంలో 2,38,223 షెల్‌ కంపెనీలను గుర్తించిందా అని ప్రశ్నిస్తూ.. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల వివరాలను షేర్‌ చేశారు.

‘ఆర్థికశాఖ చట్టాల్లో ఆఫ్‌షోర్‌ షెల్‌ కంపెనీ అంటే ఏంటో నిర్వచించలేదు. దేశ పౌరులకు సంబంధించి షెల్‌ కంపెనీల సమాచారం అందుబాటులో లేదు’ అని రాజ్యసభలో సీపీఎం సభ్యుడు జాన్‌ బ్రిటాస్‌ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి ఈ విధమైన సమాచారం ఇచ్చారు. ఈ సమాధానాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన ఎంపీ మహువా మొయిత్రా.. ఇటువంటి నేపథ్యంలో అదానీపై ప్రభుత్వం ఇక చర్యలెలా తీసుకుంటుందని విమర్శలు గుప్పించారు.

మరోవైపు గుజరాత్‌ సీఎంగా మోదీ ఉన్నప్పటి నుంచే అదానీతో విడదీయరాని సంబంధాలున్నాయని కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా అదానీ షెల్‌ కంపెనీల్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టిందెవరంటూ ప్రశ్నిస్తోంది. వీటిపై ప్రధాని మోదీ సమాధానం చెపాల్సిందేనని.. సంయుక్త పార్లమెంటరీ సంఘం (JPC) ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తోంది. ఇందుకు విపక్ష పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. అయినప్పటికీ ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని