Modi: ‘యువరాజు’ వస్తున్నారని.. నా హెలికాప్టర్‌ను ఆపేశారు..!

పంజాబ్‌లో ‘యువరాజ్‌’ పర్యటిస్తున్నారనే కారణంతో నేను ప్రయాణించే హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వలేదంటూ రాహుల్‌ గాంధీ పేరు ప్రస్తావించకుండా తనకు ఎదురైన అనుభవాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు.

Published : 15 Feb 2022 01:47 IST

కాంగ్రెస్‌పై మండిపడ్డ ప్రధాని మోదీ

జలంధర్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే పార్టీ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ నేత వస్తున్నారనే కారణంగా తాను ప్రయాణించే హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇందుకు సంబంధించి గతంలో (2014లో) ఎదురైన అనుభవాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జలంధర్‌లో పర్యటించిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు.

‘2014 ఎన్నికల సమయంలో పఠాన్‌కోట్‌లో నా హెలికాప్టర్‌ను ఎగరకుండా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలిపివేసింది. పంజాబ్‌లో మరో ప్రాంతంలో యువరాజ్‌ (రాహుల్‌ గాంధీ) పర్యటిస్తున్నారనే కారణంతో ఆ పని చేసింది’ అంటూ రాహుల్‌ గాంధీ పేరు ప్రస్తావించకుండా తనకు ఎదురైన అనుభవాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. తాజాగా దేవీ తలాబ్‌ మందిర్‌ దర్శించేందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఏర్పాట్లు చేయలేమని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. గతనెల ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని కాన్వాయ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాన్ని గుర్తుచేసిన ప్రధాని మోదీ.. ప్రధానికే భద్రత కల్పించలేని స్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ఇదిలాఉంటే, ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీకి నేడు ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. హోషియర్‌పుర్‌లో రాహుల్‌ గాంధీ ప్రచార సభలో పాల్గొనేందుకు  ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సిద్ధమయ్యారు. ఇందుకోసం బయలుదేరేందుకు ప్రయత్నించగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్న కారణంగా ముఖ్యమంత్రి వెళ్లే హెలికాప్టర్‌కు అనుమతి లభించలేదు. దీనిపై కాంగ్రెస్‌ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ప్రధాని మోదీ.. గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంజాబ్‌ ప్రచార సభలో గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని