
ఆసియన్‌తో సంబంధాలే భారత్‌కు ప్రాధాన్యం: మోదీ
దిల్లీ: ఆసియన్(ఆగ్నేయాసియా దేశాల సంఘం) బృంద దేశాలతో సంబంధాల్ని మెరుగుపరచడానికి భారత్ ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భారత్‌తో ఆసియన్ దేశాల బృందం గురువారం నిర్వహించిన వర్చువల్ సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఆసియన్ బృందంలోని దేశాలతో భౌతిక, ఆర్థిక, సామాజిక, వాణిజ్య రంగాల్లో సంబంధాల్ని మెరుగుపరచడానికి భారత్ ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఆగ్నేయాసియా ప్రాంతంలో అభివృద్ధి, భద్రత పెరుగుదలకు ఐక్యతతో కూడిన ఆసియన్ బృందం అవసరమని మేం భావిస్తున్నాం. భారత్ తలపెట్టిన ‘ఇండో పసిఫిక్’ కార్యక్రమానికి, ఆసియన్ బృందం తలపెట్టిన ‘అవుట్‌లుక్ ఆన్ ఇండోపసిఫిక్’ కార్యక్రమానికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఆసియన్‌తో మేం మంచి భాగస్వామ్యం కొనసాగిస్తున్నాం’ అని మోదీ తెలిపారు.
భారత్, చైనా సరిహద్దుల్లో గత కొద్ది నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆసియన్ బృందంలోని చాలా దేశాలూ చైనాతో ప్రాదేశికంగా వివాదాలను కలిగి ఉండటం గమనార్హం. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా ఈ పది దేశాలు ఆసియన్ బృందంలో ఉన్నాయి. భారత్ సహా యూఎస్, జపాన్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఆసియన్ బృందానికి సలహాదారులుగా వ్యవహరిస్తున్నాయి.