Mallikarjun Kharge: మోదీజీ.. ‘చైనా పే చర్చ’ ఎప్పుడు?: ఖర్గే

సరిహద్దులో చైనా ఆగడాల కట్టడి విషయంలో మోదీ ప్రభుత్వం తీరును కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే శనివారం విమర్శించారు. ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు.

Published : 17 Dec 2022 12:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా (China)తో సరిహద్దు వివాదంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్‌ (Congress) మరోసారి విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారంటూ ప్రధాని మోదీ (PM Modi)ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఓ ట్వీట్‌ చేశారు. ‘‘డోక్లాం ప్రాంతంలో జంఫేరీ పర్వత శ్రేణి (Jampheri ridge) వరకు చైనా నిర్మాణాలు చేపట్టింది. ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా నిలిచే, భారత వ్యూహాత్మక ‘సిలిగురి కారిడార్ (Siliguri Corridor)’కు ఇది ముప్పుగా పరిణమించింది. మన జాతీయ భద్రతకు అత్యంత ఆందోళన కలిగించే అంశం ఇది! నరేంద్ర మోదీజీ.. ‘చైనా పే చర్చా’ ఎప్పుడు?’’ అని ఖర్గే ట్వీట్‌ చేశారు. డ్రాగన్‌ యుద్ధానికి సన్నద్ధమవుతుంటే మోదీ ప్రభుత్వం నిద్రపోతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ సైతం శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే.

సిలిగురి కారిడార్‌ ఎందుకు ముఖ్యం..?

ఈశాన్య భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఈ ప్రదేశం నుంచే వెళతాయి. దీన్ని ‘చికెన్స్‌ నెక్‌’గానూ పిలుస్తారు. దీంతోపాటు కీలక పైప్‌లైన్లు, కమ్యూనికేషన్‌ కేబుల్స్‌కు ఇదే మార్గం. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంది. నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరుచేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. రక్షణ శాఖ అధికారులు కూడా గతంలో చికెన్స్‌ నెక్‌ను ఎంతో ‘సున్నితమైంది’గా అంగీకరించారు. డోక్లాం ఘటన తర్వాత ఈ ప్రాంతానికి సమీపంలో, వాస్తవాధీన రేఖకు ఆవల చైనా తన నిర్మాణాల వేగాన్ని పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని