Updated : 06 Jul 2021 10:35 IST

కేబినెట్‌ విస్తరణ: మంత్రులతో మోదీ భేటీ రద్దు

దిల్లీ: కేంద్ర కేబినెట్‌ విస్తరణపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ కీలక మంత్రులు, భాజపా జాతీయాధ్యక్షుడితో నేడు జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ రద్దయ్యింది. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరగాల్సి ఉంది. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, ప్రహ్లాద్‌ జోషీ, పీయూష్‌ గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌తో పాటు భాజపా జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ఈ భేటీలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి. కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో మంత్రుల పనితీరు, భవిష్యత్‌ పథకాలపైనే ప్రధానంగా చర్చ జరగనుందని తెలిసింది. అయితే అనూహ్యంగా ఈ భేటీ రద్దయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఎందుకు రద్దు చేశారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. 

కేంద్ర కేబినెట్‌ విస్తరణపై ఇటీవల ఊహాగానాలు జోరందుకున్నాయి. గత ఆదివారం ప్రధాని మోదీ, అమిత్ షా, బీఎల్‌ సంతోష్‌ సుదీర్ఘంగా సమావేశమవటం వీటికి మరింత బలం చేకూర్చింది. విస్తరణ జాబితాకు తుది మెరుగులద్దడానికే వీరు సమావేశమయ్యారని అనుకుంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నా.. ఈ నెల 7 లేదా 8వ తేదీల్లో విస్తరణ ఉండొచ్చని రాజకీయ వర్గాల సమాచారం.

2019లో మోదీ రెండో దఫా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నుంచి ఇంతవరకూ మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. నిబంధనల ప్రకారం.. కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్‌లో 53 మంది మాత్రమే ఉన్నారు. చాలా మంత్రుల వద్ద ఒకటికంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు ఉండగా.. కొన్ని శాఖలకు సహాయమంత్రులు లేరు. దీంతో మంత్రివర్గ విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది.

ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, అసోం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్‌ సోనోవాల్‌, భాజపా నేత సుశీల్‌ కుమార్‌ మోదీ, ఎల్జేపీలో తిరుగుబావుటా ఎగురవేసిన పశుపతి పరాస్‌ తదితరులకు కేబినెట్‌ బెర్త్‌ దక్కుతుందనే ప్రచారం బలంగా ఉంది. మరోవైపు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఓటర్లను దృష్టిపెట్టుకుని మంత్రులను ఖరారు చేయాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని