Drone Attack: మోదీతో అమిత్‌షా, రాజ్‌నాథ్‌ భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ కూడా ఈ భేటీలో

Updated : 29 Jun 2021 17:09 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు నేడు సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ఏ విషయాలను చర్చిస్తున్నారన్నదానిపై అధికారిక సమాచారం లేనప్పటికీ.. జమ్మూకశ్మీర్‌లో డ్రోన్‌ దాడుల ముప్పు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్లు జమ్మూ వైమానిక స్థావరంలోకి ప్రవేశించి ఒక భనవంపై, అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంపై బాంబులు జారవిడిచిన విషయం తెలిసిందే. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ  రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో భవనం పైకప్పునకు రంధ్రం పడింది. కాగా.. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత జమ్మూలోని మరో సైనిక స్థావరంపై దాడిని సైన్యం భగ్నం చేసింది. రత్నచక్‌, కాలూచక్‌ సైనిక ప్రాంతంపై ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్‌, అర్ధరాత్రి తర్వాత 2.40 గంటలకు ఇంకో డ్రోన్‌ తిరిగాయి. రెండూ క్వాడ్‌కాప్టర్‌లే. వీటి కదలికలను వెంటనే కనిపెట్టిన సైన్యం అప్రమత్తమై కాల్పులు జరిపింది. దీంతో అవి చీకట్లో తప్పించుకున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 

డ్రోన్‌ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ముఠా హస్తం ఉన్నట్లు జమ్మూకశ్మీర్‌ డీజీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విచారణను కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని