Modi: అదొక ఆలోచన మాత్రమే.. మీపై రుద్దాలనుకోవడం లేదు..!

 నకిలీ సమాచారంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సందేశాన్ని ఫార్వర్డ్ చేసేముందు, విశ్వసించేముందు ఒకటికి పదిసార్లు తరచి చూసుకోవాలని సూచించారు.

Published : 28 Oct 2022 23:34 IST

ఫరీదాబాద్‌: రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించే పోలీసుల యూనిఫాంలో ఏకరూపత ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ కోరుకున్నారు. ఈ మేరకు హరియాణాలోని ఫరీదాబాద్‌లో రాష్ట్రాల హోం మంత్రులు, డీజీపీలతో శుక్రవారం నిర్వహించిన చింతన్‌ శిబిరంలో ప్రతిపాదన చేశారు. అయితే ఇది కేవలం సూచన మాత్రమేనన్నారు. 

‘‘ఒకే దేశం, ఒకే యూనిఫాం’ పోలీసులకు కూడా ఉండాలనుకుంటున్నాను. ఇది ఒక ఆలోచన మాత్రమే. దీనిని మీపై రుద్దాలని నేను అనుకోవడం లేదు. ఇది ఇప్పుడైనా జరగొచ్చు, వందేళ్ల తర్వాతైనా జరగొచ్చు. మీకొక ఆలోచన కోసం చెప్పాను’ అని ప్రధాని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పనిచేస్తోన్న పోలీసుల గుర్తింపు ఒకే విధంగా ఉండాలని భావిస్తున్నానన్నారు. పోస్టుబాక్స్‌ను ఎలా గుర్తుపట్టగలమో.. పోలీసు యూనిఫాంను కూడా అలానే గుర్తించగలిగేలా ఉండాలన్నారు. 

అలాగే నకిలీ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒక సందేశాన్ని ఫార్వర్డ్, విశ్వసించేముందు ఒకటికి పదిసార్లు తరచి చూసుకోవాలి. అది నకిలీ వార్తో కాదో తెలియజేసే టూల్స్ అందుబాటులో ఉన్నాయి. పలు మార్గాల్లో దానిని ఆన్‌లైన్‌లో బ్రౌజ్‌ చేస్తే.. దాని గురించి కొత్త విషయం తెలుసుకుంటారు. నకిలీ వార్తల కట్టడి కోసం కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలి’ అని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని