Sudha Murty: రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ

సర్వైకల్ క్యాన్సర్‌ నివారణ మార్గాలపై అవగాహన కల్పించేలా ఎంపీ సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభలో ప్రసంగించారు. దానిపై మోదీ(Modi) స్పందించారు. 

Published : 03 Jul 2024 15:54 IST

Cervical Cancer Vaccination|దిల్లీ: రచయిత్రి, వితరణశీలిగా సుపరిచితురాలైన సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభ ఎంపీగా చేసిన తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యంపై తన ప్రసంగంలో వెల్లడించారు. దీనిపై తాజాగా మోదీ (Modi) స్పందించారు. బుధవారం ఎగువసభకు వచ్చిన ఆయన ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. ప్రస్తుతం నడుస్తోన్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె సభలో మాట్లాడారు. ‘‘9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సినేషన్ (Cervical Cancer Vaccination) ఇస్తుంటారు. దానిని తీసుకుంటే.. క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు. చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి.. అమ్మాయిల మెరుగైన భవిష్యత్తు కోసం దానిని అందివ్వాలి’’ అని వెల్లడించారు. ఈసందర్భంగా తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని తన మనసులో నాటుకుపోయిన ఆ మాటల సారాన్ని ఈసందర్భంగా ప్రస్తావించారు.

అలాగే కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా నిర్విఘ్నంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని గుర్తుచేసిన ఆమె..  ఆ అనుభవంతో సర్వైకల్‌ వ్యాక్సిన్‌ను బాలికలకు అందించడం కష్టమేమీ కాదని అన్నారు. దీంతోపాటు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. ఆదాయాన్ని పెంచే దిశగా పర్యటనలకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్లు, టాయిలెట్లు వంటి సదుపాయాలను మెరుగుపర్చాలని సూచించారు.

ఈ ప్రసంగాన్ని ఉద్దేశించి ఈ రోజు మోదీ (PM Modi) మాట్లాడారు. ‘‘మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలు. గత పదేళ్లకాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టిసారించింది’’ అని తెలిపారు. తమ ప్రభుత్వం శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసిందని, గర్భిణీలకు వ్యాక్సినేషన్‌ను తీసుకువచ్చామని సభావేదికగా వెల్లడించారు. కాగా, సర్వైకల్‌ క్యాన్సర్‌ను అదుపు చేయడానికి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు టీకాలు వేయించడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని