ప్రజలకు ప్రముఖుల శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరిపైనా ఆ శ్రీరాముడి కృప ఉండాలని ఆకాంక్షించారు.

Updated : 21 Apr 2021 10:43 IST

దిల్లీ: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరిపైనా ఆ శ్రీరాముడి కృప ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేశ ప్రజలందరిపై ఆ శ్రీరామచంద్రుడి కృప ఉండాలి. మర్యాద పురుషోత్తముడైన ఆయన సందేశాన్ని అందరూ అనుసరించాలి. కరోనా సంక్షోభం నెలకొన్న ఈ సందర్భంలో అందరూ జాగ్రత్త చర్యలు పాటించండి’ అని మోదీ ట్వీట్‌లో వెల్లడించారు.

రాముడి జీవితం స్ఫూర్తిదాయకం: రాష్ట్రపతి

‘అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. పురుషోత్తముడైన రాముడి జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం. ఈ సందర్భంగా మనందరం కొవిడ్‌-19 మహమ్మారిని ఓడిద్దామని ప్రతిజ్ఞ చేద్దాం’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

శ్రీరాముడు ఆదర్శప్రాయుడు: జగన్‌

శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని ఏపీ సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, న్యాయం మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావనమూర్తి శ్రీరామచంద్రుడు అని జగన్‌ అన్నారు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనకు ఆదర్శప్రాయుడని తెలిపారు. పుణ్య దంపతులు సీతారాముల కల్యాణం ఈ లోకానికి పండుగ రోజు అని జగన్ ట్వీట్‌ చేశారు. 

ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలి: కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలుగు ప్రజలకు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని, రాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు.

శ్రీరాముడు సుగుణాలకు ప్రతిరూపం: చంద్రబాబు

తెలుగు వారందరికీ తెదేపా అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడంటే మనిషిలోని సుగుణాలకు ప్రతిరూపమన్నారు. ప్రజలకు మంచిని చేయాలనే చిత్తశుద్ధి కలిగిన వాడు, తన కుటుంబ సౌఖ్యం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించేవాడు పాలకుడిగా ఉంటే అది ఎప్పటికీ రామరాజ్యమే అవుతుందని చంద్రబాబు ట్వీట్‌ ద్వారా వివరించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు సామాన్యులు, శరణు కోరిన వారి పట్ల శాంతస్వభావిగా.. అవసరమైనప్పుడు దుర్మార్గులను కఠినంగా శిక్షించాడని రామకథ ద్వారా పెద్దలు చెప్పినట్లు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.
 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని