Modi: విమర్శకులు ఎక్కడున్నారు.. అంతా ఆరోపించేవారే: మోదీ

ఆత్మనిర్భర్‌ భారత్‌ కారణంగానే ఈ రోజు మనం టీకా పంపిణీలో అఖండ విజయం సాధించగలిగామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు

Published : 02 Oct 2021 13:29 IST

దిల్లీ: ఆత్మనిర్భర్‌ భారత్‌ కారణంగానే ఈ రోజు మనం టీకా పంపిణీలో అఖండ విజయం సాధించగలిగామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సాంకేతికత వెన్నెముకగా మారిందని, అందువల్లే మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా సులభంగా టీకా తీసుకోగలుగుతున్నారన్నారు. ఓపెన్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలపై కూడా స్పందించారు. విమర్శకులను తాను చాలా గౌరవిస్తానని, అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు చాలా మంది ఆరోపణలే చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

స్వావలంబనే.. సాధించి పెట్టింది..

‘‘ఒకవేళ మన దేశం టీకాలు అభివృద్ధి చేయకపోయి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో ఓ సారి ఊహించుకోండి. ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభాకు టీకాలు అందుబాటులో లేవనే విషయం మనకు తెలిసిందే. కానీ ఈ రోజు మనం వ్యాక్సినేషన్‌లో భారీ విజయం సాధించాం. ఇదంతా స్వావలంబన(ఆత్మనిర్భర్‌) వల్లే సాధ్యమైంది. టీకా పంపిణీ కార్యక్రమం కోసం 2020 మే నుంచి మేం ప్రణాళికలు మొదలుపెట్టాం. అప్పటికీ ప్రపంచంలో ఎక్కడా ఏ టీకాకు ఆమోదం లభించలేదు. అంతేగాక, వ్యాక్సినేషన్‌ కోసం పాత పద్ధతులను పాటిస్తే దేశ ప్రజలందరికీ టీకాలు అందించాలంటే దశాబ్దాలు పడుతుంది. కానీ, మేం వీలైనంత వేగంగా, సమర్థంగా టీకాలు పంపిణీ చేయాలనుకున్నాం’’ అని మోదీ చెప్పుకొచ్చారు. 

పేద ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు ఎదురుచూడాల్సిన, లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేశామని మోదీ అన్నారు. ఓ నిరుపేద వలస కూలి తొలి డోసు టీకా తన గ్రామంలో తీసుకుంటే రెండో డోసు కూడా అక్కడే తీసుకోవాల్సిన పని లేదని, తాను పనిచేస్తున్న నగరంలోనూ వ్యాక్సిన్‌ పొందేలా సాంకేతికతలో మార్పులు తీసుకొచ్చామని ప్రధాని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే టీకా పంపిణీలో భారత్‌ మెరుగైన స్థితిలో ఉందని మోదీ తెలిపారు.

విమర్శలు.. ఆరోపణలు వేర్వేరు..

‘‘నిజాయతీగా చెప్పాలంటే నాకు విమర్శకులపైన చాలా గౌరవం ఉంది. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు విమర్శల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది కేవలం ఊహాజనిత అంశాలను పట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి విమర్శలు, ఆరోపణలు వేర్వేరు. విమర్శలు చేయాలంటే ఆ అంశంపై చాలా అధ్యయనం చేయాలి. కానీ ఇప్పుడు ఎలాంటి అధ్యయనం, విశ్లేషణ లేకుండా కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. అందువల్ల కొన్నిసార్లు నేను విమర్శలను మిస్సవుతున్నా’’ అంటూ ప్రతిపక్షాలపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని