Modi to Biden: ప్రపంచానికి ఆహారం అందించేందుకు భారత్‌ సిద్ధం : మోదీ

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) అనుమతిస్తే ప్రపంచానికి ఆహార నిల్వలను అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 12 Apr 2022 15:47 IST

వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ అనుమతిస్తే సిద్ధంగా ఉన్నామన్న ప్రధాని

అహ్మదాబాద్‌: ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) అనుమతిస్తే ప్రపంచానికి ఆహార నిల్వలను అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడిన సందర్భంలో ప్రతిపాదించానని గుర్తుచేశారు. గుజరాత్‌లోని శ్రీ అన్నపూర్ణ ధామ్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ.. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆహార నిల్వలు వేగంగా క్షీణించిపోతున్నాయని అన్నారు.

‘తమకు కావాలనుకున్నవి దొరకక ప్రపంచ దేశాలు అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అన్ని దారులు మూసుకుపోవడంతో పెట్రోల్‌, ఆయిల్‌, ఫర్టీలైజర్లను సమకూర్చుకోవడం కష్టంగా మారింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత తమ నిల్వలను భద్రపరచుకోవాలని ప్రతిఒక్కరూ జాగ్రత్తపడుతున్నారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఇదే సమయంలో ప్రపంచం మరోకొత్త సమస్య ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార నిల్వలు ఖాళీ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇదే సమస్యను లేవనెత్తారు. ఒకవేళ ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) అనుమతిస్తే ప్రపంచానికి ఆహార నిల్వలు రేపటి నుంచే సరఫరా చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది’ అని చెప్పినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.

‘మన ప్రజలకు సరిపోయేంత ఆహారం అందుబాటులో ఉంది. ఇదే సమయంలో ప్రపంచానికి అన్నం పెట్టేందుకు మన రైతులు ఏర్పాట్లు చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. ప్రపంచానికి ఆహారం సరఫరా చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి ఎప్పుడు ఇస్తుందో తెలియదు’ అని మోదీ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో పరస్పరం భిన్న వైఖరుల్ని అనుసరిస్తోన్న భారత్‌, అమెరికాలు ఒకే వేదికపైకి వచ్చి సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య వర్చువల్‌గా జరిగిన కీలక భేటీలో ఉక్రెయిన్‌ యుద్ధంపైనే ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ యుద్ధంపై తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్లు భారత్‌ మరోసారి ఉద్ఘాటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని