PM Modi: ఈ ‘ప్రత్యేక’ సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు: ప్రధాని మోదీ

ఈ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) ప్రకటించారు. సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated : 18 Sep 2023 11:04 IST

దిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM  Modi) పార్లమెంట్‌ ముందు మీడియాతో మాట్లాడారు. భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్‌ ఆశాకిరణంగా మారిందని ప్రధాని అన్నారు. ఇక, ఈ ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు మోదీ వెల్లడించారు.

‘‘ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్‌ పయనిస్తోంది. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుంది. దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. దేశాభివృద్ధి నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఈ ప్రత్యేక సమావేశాల నిడివి తక్కువే అయినప్పటికీ.. జరుగుతున్న సందర్భం చాలా గొప్పది. ఇందులో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నాం’’ అని మోదీ వివరించారు.

ఎందుకీ ‘ప్రత్యేకం’! రాజ్యాంగంలో లేని ‘ప్రత్యేకం’ ప్రస్తావన

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ‘‘ఈ సమావేశాలు చాలా ముఖ్యమైనవి. పార్లమెంట్‌ సభ్యులంతా దీనికి హాజరుకావాలని కోరుకుంటున్నా. ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదు. విశ్వాసం, సానుకూల దృక్పథంతో వీటిని నిర్వహించుకుందాం. సభ్యులంతా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నా’’ అని మోదీ అన్నారు.

స్ఫూర్తి కేంద్రంగా శివశక్తి పాయింట్‌..

ఇక, చంద్రయాన్‌-3, జీ20 సదస్సు విజయం గురించి మోదీ ప్రస్తావించారు. ‘‘జాబిల్లిపై మన మిషన్‌ విజయవంతమైంది. చంద్రయాన్‌-3తో మన జెండా సగర్వంగా రెపరెపలాడింది. శివశక్తి పాయింట్‌ నవ శకానికి స్ఫూర్తి కేంద్రంగా మారింది. ఇలాంటి విజయాలు సాధించినప్పుడే శాస్త్ర, సాంకేతికతలో మనమెంత ముందున్నామో ప్రపంచానికి తెలుస్తుంది. ఈ విజయంతో అనేక అవకాశాలు భారత్‌ తలుపులు తడుతాయి. జీ20 సదస్సు అద్భుతంగా జరిగింది. భారత ఉజ్వల భవిష్యత్తుకు ఈ సదస్సు మార్గదర్శనం చేసింది. జీ20 సదస్సుల్లో మన ప్రతిపాదనలను అన్ని దేశాలు ఆమోదించాయి. ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం దక్కింది’’ అని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని