
Modi: మోదీకి 71 శాతం ప్రజామోదం.. ప్రపంచంలోనే ‘నంబర్ 1’ దేశాధినేత
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి అగ్ర స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో మోదీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారు. ఇక ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆరో స్థానంలో నిలిచారు.
ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల అధినేతలపై మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో మోదీ 71 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ అధ్యక్షుడు మారియో డ్రాగీ 60 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనెడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడోలకు 43 శాతం ప్రజామోదం లభించింది. ఇటీవల కాలంలో వరుస ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ 26 శాతం ప్రజామోదంతో జాబితాలో చిట్టచివరి స్థానంలో నిలిచారు.
మార్నింగ్ కన్సల్ట్ గత సర్వేల్లోనూ ప్రజామోదంలో మోదీ నంబర్ వన్ స్థానంలోనే ఉన్నారు. 2020 మే నెలలో వెల్లడించిన సర్వేలో మోదీకి 84 శాతం ప్రజామోదం లభించింది. ఆ తర్వాత గతేడాది మే నెలలో కరోనా రెండో దశ ఉద్ధృతి సమయంలో మాత్రం ఇది 63 శాతానికి పడిపోయింది. తాజా సర్వేలో 71 శాతం మంది మోదీని ఆమోదించారు. జనవరి 13-19 మధ్య వారం పాటు ప్రతి దేశంలోనూ వయోజనుల నుంచి అభిప్రాయాలు సేకరించి మార్నింగ్ కన్సల్ట్ ఈ రేటింగ్స్‌ను విడుదల చేసింది. అమెరికాలో సగటున రోజుకు 45వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా.. మిగతా దేశాల్లో సగటున 3000 - 5000 మందిని సర్వే చేశారు.
ప్రజామోదంలో టాప్ లీడర్లు వీరే..
నరేంద్ర మోదీ, భారత ప్రధాని 71 శాతం
లోపెజ్ ఒబ్రేడర్, మెక్సికో అధ్యక్షుడు 66 శాతం
మారియో డ్రాగీ, ఇటలీ ప్రధాని 60 శాతం
ఫుమియో కిషిదా, జపాన్ ప్రధాని 48 శాతం
ఒలఫ్ స్కాల్జ్, జర్మనీ ఛాన్సలర్ 44 శాతం
జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు 43 శాతం
జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని 43 శాతం
స్కాట్ మారిసన్, ఆస్ట్రేలియా ప్రధాని 41 శాతం
పెడ్రో సాంచెజ్, స్పెయిన్ ప్రధాని 40 శాతం
మూన్ జే-ఇన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు 38 శాతం
జైర్ బోల్సొనారో, బ్రెజిల్ అధ్యక్షుడు 37 శాతం
ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు 34 శాతం
బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని 26 శాతం