Modi: జాతినుద్దేశించి నేడు మోదీ ప్రసంగం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటటకు మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని అధికారిక వర్గాలు వెల్లడించాయి

Updated : 07 Jun 2021 13:50 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి, వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. 

వ్యాక్సిన్‌ విధానం, టీకాల కొరతపై రాష్ట్రాలు, నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. దీనిపై మోదీ ప్రధానంగా మాట్లాడనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. టీకా ధరలు, వ్యాక్సిన్‌ పంపిణీపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. దేశంలో టీకాల కొరత తీర్చేందుకు విదేశీ టీకాల దిగుమతికి కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే విదేశీ టీకాలకు ఇటీవల మరిన్ని మినహాయింపులు కల్పించింది.

ఏప్రిల్‌ - మే నెలల్లో తీవ్రంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి.. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టింది. అనేక రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లు, ఆంక్షలతో వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గింది. తాజాగా రోజువారీ కేసులు లక్షకు దిగొచ్చాయి. అయితే కేసులు తగ్గుముఖం పట్టినా.. వ్యాక్సిన్‌ పంపిణీ మాత్రం ఆశించినంత వేగంగా లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఉంటే మూడో దశ మరింత ఉద్దృతంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని